జనగామ రూరల్: మొక్కలతోనే పర్యావరణ రక్షణ సాధ్యమవుతుందని సీనియర్ సివిల్ జడ్జి శంకరం శ్రీదేవి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వర్షాకాలంలో విరివిగా మొక్కలు నాటాలని అలాగే వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకుసేవలు సద్వినియోగం చేసుకోవాలి
పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): రైతులు డీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మె ల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంకు శాఖను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజ నం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ సీఈఓ వజీర్ సల్తాన్, మేనేజర్ చుక్క గణేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, ఏఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, దేవరుప్పుల, కామారెడ్డిగూడెం సర్పంచ్‌లు పెద్ది కృష్ణమూర్తి, చింత రవి, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండు, పీఎసీఎస్ సీఈఓ కృష్ణమూర్తి, ఆయా గ్రామాల డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న నాన్–టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్ – 1 పోస్టుకు కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ట్యాలీ, సాఫ్ట్‌వేర్ వినియోగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని, వేతనం రూ.14,300 ఉంటుందన్నారు. అలాగే అసిస్టెంట్ కుక్ – 1 పోస్టుకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వంట నైపుణ్యాలను నిర్ధారించేందుకు డెమో ఉంటుందన్నా రు. వీరికి నెలవారీ వేతనం రూ.9,750 ఉంటుందన్నారు. అటెండర్ – 1 పోస్టుకు 10వ త రగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వీరికి వేతనం రూ.9,750 ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పత్రాల జిరాక్స్ ప్రతులతో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5.గంటల లోపు జనగామ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9849628441 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
రైతుల కష్టం చూడలేక..
రఘునాథపల్లి: వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అధికారులు, పోలీసులు స్పందించారు. వాహనాల కొరతతో ధాన్యం తరలింపు జాప్యం అవుతుండడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నమత, ఎస్సై దూదిమెట్ల నరేష్ సిబ్బందితో కలిసి వర్షంలోనే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై ఇసుక తరలింపునకు వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. లారీ డ్రైవర్లు కొనుగోలు కేంద్రాలకు వెళ్లేందుకు ససేమిరా అనడంతో మరి కొందరు డ్రైవర్లతో పాటు వాహన యజమానులతో వారు మాట్లాడి.. ధాన్యం తరలింపునకు వెళ్లేలా ఒప్పించారు. దీంతో మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు ధాన్యం తరలింపునకు వెళ్లాయి.


