అంగన్‌వాడీలకు 15వరకు సెలవులు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు 15వరకు సెలవులు

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

సెలవు రోజుల్లో ఇంటికే రేషన్‌

జనగామ: తీవ్రమైన ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల వేసవి సెలవులను ఈ నెల15వ తేదీ వరకు పొడిగించింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శృతిఓజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

12 నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభం

రాష్ట్ర సర్కారు అంగన్‌వాడీల సెలవులను పెంచడంతో పాటు ఈ నెల 12 వ తేదీ నుంచి అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, భద్రాద్రి జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ పిల్లలకు ఉప్మా లేదా కిచిడితో పాటు పాలు అందించనున్నారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే క్రమంలో జిల్లాలోనూ చిన్నారులకు బలవర్ధకమైన, పౌష్టికాహారం అ ందనుంది. జిల్లాలో 695 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు 10,906 మంది, 3నుంచి 6 సంవత్సరాల వయసు గల 10,364 మంది చిన్నారులు ఉన్నారు. వీటి పరిధిలో 21,270 మంది పిల్లలు అంగన్‌వాడీలకు వస్తుండగా, నూతన విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

సెలవులు పొడిగించిన నేపథ్యంలో లబ్ధిదారులకు వేడి భోజనానికి బదులుగా టేక్‌ హోమ్‌ రేషన్‌ అందించాలని ప్రభుత్వం డీడబ్ల్యూఓలను ఆదేశించింది. జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు 14వ తేదీ వరకు సరిపడా ఎగ్స్‌, ఫుడ్‌ ఐటెమ్స్‌, ఇతర వస్తువులను చిన్నారుల తల్లిదండ్రులకు అందించనున్నారు. సరుకులను అందించే సమయంలో ఫొటో క్యాప్చర్‌ చేస్తారు. ఈ నెల 15న కేంద్రాలు తెరిచిన వెంటనే మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్లు యథావిధిగా అందించనుండగా, బ్రేక్‌ఫాస్ట్‌ పథకం సైతం త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో పిల్లల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేస్తే పథకం లక్ష్యం నెరవేరుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

వేసవి తీవ్రత నేపథ్యంలో

ప్రభుత్వ నిర్ణయం

21వేల మంది చిన్నారులకు ఊరట

చిన్నారుల ఇంటికే ఆహార సరుకులు

Advertisement
 
Advertisement
Advertisement