గాలివాన బీభత్సం.. | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం..

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జిల్లాలో పలు మండలాల్లో వర్షం

స్టేషన్‌ఘన్‌ పూర్‌లో అత్యధికంగా

74.5 మి.మీ వర్షపాతం

జనగామ: జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 12.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలో 74.5 మి.మీ భారీ వర్షం కురిసింది. జనగామలో 26.5 మి.మీ, చిల్పూర్‌ మండలం మల్కాపూర్‌ లొకేషన్‌లో 24 మి.మీ, జనగామ మండలం వడ్లకొండలో 23 మి.మీ, బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్‌లో 22 మి.మీ, తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో 21.8 మి.మీ చొప్పు న మోస్తారు వర్షపాతం నమోదైంది. ఇంకా పాలకుర్తి మండలం గూడూరు, తరిగొప్పుల, జఫర్‌గఢ్‌ మండలం కూనూర్‌, లింగాలఘణపురం, దేవరుప్పుల మండలం కోలుకొండ వర్షం కురిసింది.

ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు మండలంలోని పలు గ్రామల్లో మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురియడంతో ఘన్‌పూర్‌లో జాతీయ రహదారితో పాటు పలు ఏరియాల్లో రోడ్డుపై నుంచి వర్షపునీరు వరదగా పారింది. పలుచోట్ల పందిళ్లు, రేకులషెడ్లకు చెందిన రేకులు ఎగిరిపడ్డాయి. మండలంలోని పాంనూర్‌, శివునిపల్లి, నమిలిగొండ, ఇప్పగూడెం, విశ్వనాధపురం తదితర గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. దీంతో రైతులు ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించుకునేందుకు అరిగోస పడాల్సి వచ్చింది. ఘన్‌పూర్‌ డివిజన్‌కేంద్రంలోని మెడ్‌ప్లస్‌ సమీపంలో ఉన్న కె.కృష్ణకుమారి ఇంటిలో ఒక్కసారిగా పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులు ధ్వంసమయ్యాయి. పిడుగుపాటుతో ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్యాన్లు, లైట్లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికకరాలు కాలిపోవడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందన్నారు.

పిడుగుపాటుకు పాడి గేదె మృతి

జనగామ రూరల్‌: మండలంలోని శామీర్‌పేట గ్రామంలో చాపల భాస్కర్‌ స్రవంతికి చెందిన పాడి గేడె పిడుగుపడి మృతి చెందింది. రూ.లక్ష విలువచేసే గేదె మృతి చెందిందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితురాలు కోరారు.

నర్మెటలో..

నర్మెట: ఈదురుగాలులతో కురిసిన భారీవర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొన్నిచోట్ల కొట్టుకుపోగా, నింపిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మండలంలోని తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, తరలింపు వాహనాల కొరతతో ఇంకా 30 శాతం నిల్వలు ఉన్నాయి.

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట: మండలంలో పలు గ్రామాల్లో ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. గాలులకు పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement