● బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ ఆగేనా..
● పట్టణ సమస్యలపై దృష్టి సారిస్తారా?
● నేటి మూడో మున్సిపల్ కౌన్సిల్ భేటీపై ప్రజల్లో చర్చ
జనగామ: మూడోసారి కౌన్సిల్ సమావేశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కుర్చీ వివాదంపై మొదటి సమావేశం, ఎజెండా విషమంలో రెండో సమావేశంలో సమస్యలపై ప్రస్తావన లేకుండానే ముగిశాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదాలకే పరిమితమా, పట్టణ సమస్యలపై దృష్టి సారిస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు(శుక్రవారం) చైర్‌పర్సన్ బాలమణి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. నూతన పాలక మండలి ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న ఈ భేటీలోనైనా వీధి దీపాలు, డ్రైనేజీ, చెత్త, తదితర సమస్యలపై చర్చ జరుగుతుందా అని ప్రజలు ఆశిస్తున్నారు.
రెండు సమావేశాలు ఇలా...
ఈ ఏడాది మార్చి 31న నూతన కౌన్సిల్ కొలువుదీరిన తర్వాత తొలి సమావేశంలో వైస్ చైర్మన్‌కు వేదికపై కుర్చీ వేయకపోవడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోడియం వద్ద బైఠాయింపులు, నిరసనలతో దాదాపు రెండున్నర గంటల తర్వాత సమావేశాన్ని వాయిదా వేశారు. అనంతరం మే 6న వాయిదా పడిన సమావేశాన్ని మరోసారి నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమైనా బీఆర్‌ఎస్‌కు చెందిన మెజారిటీ కౌన్సిలర్లు అరగంట ఆలస్యంగా హాజరయ్యారు. అప్పటికే కోరం ఉండడంతో 54 ఎజెండా అంశాలను ఆమోదించారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు హాజరై తాము రాకుండా 54 అంశాలను అరగంటలో ఎలా ఆమోదిస్తారంటూ పోడియం వద్ద కమిషనర్‌ను నిలదీశారు. ఆ సమావేశంలోనూ పట్టణ సమస్యలపై ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసింది. ఇప్పుడు మూడోసారి జరగనున్న సాధారణ సమావేశంలోనైనా 30 వార్డుల పరిధిలో మౌలిక వసతులు, వీధి దీపాలు, డ్రెయినేజీ నిర్వహణ, స్వచ్ఛత, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, నాలాల వద్ద ప్రమాదకర పరిస్థితులు, కంపు కొడుతున్న కాలనీలు, వచ్చే వానాకాలంలో ముంపు ప్రాంతాల వంటి అంశాలపై ఫోకస్ చేసి చర్చిస్తారా లేదా మళ్లీ ఇదే వివాదాన్ని కొనసాగిస్తారా అనే విషయమై ప్రజలు చర్చించుకుంటున్నారు.


