● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: కొనుగోలు కేంద్రంలోని ఉన్న ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భరోసా ఇచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో కురిసిన అకాల వర్షం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడవకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పలుచోట్ల 200 ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిచాయని, వాటిని కూడా వెంటనే మిల్లులకు కూడా తరలించడం జరిగిందన్నారు.
లోడింగ్ వేగంగా పూర్తిచేయాలి
బచ్చన్నపేట: ధాన్యం బస్తాల లోడింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండలంలోని తమ్మడపల్లి గ్రామ పరిధిలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో కొనుగోళ్ల నిర్వహణ తీరు, ధాన్యం రవాణా, నమోదు ప్రక్రియలు, కాంటా వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ట్రాక్టర్ యజమానులు సహకరించాలి
నర్మెట: ఽకొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తరలింపులో ట్రాక్టర్ యజమానులు సహకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వెల్దండలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు.
ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


