జనగామ: జిల్లాలో ఒకే రోజు 62 మహిళా శక్తి రైతు సేవాకేంద్రాలకు ఫర్టిలైజర్ షాపుల లైసెన్సులు జారీ చేయడం ప్రత్యేక ఘట్టమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇ–పాస్ మిషన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైతు సేవా కేంద్రాలకు లైసెన్సులు మంజూరు చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. జిల్లాలో 62 రైతు వేదికలు ఉన్నాయని, ప్రతి వేదికలో ఏఈఓల ద్వారా అవసరమైన శిక్షణ ఇస్తారని వివరించారు. కేంద్రాలకు ఎరువులతో పాటు విత్తనాలు, పురుగు మందుల లైసెన్సులు కూడా అందించామని, రైతులకు అన్ని సేవలు ఒకే వేదికపై అందించడమే లక్ష్యమన్నారు. ఈ కేంద్రాలు సమర్థంగా పనిచేస్తే భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయ సేవలు, పరికరాలు, ట్రాక్టర్లు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఏపీడీ నూరుద్దీన్, ఇతర అధికారులు, రైతు సేవా కేంద్రాల మహిళలు పాల్గొన్నారు.
మహిళా శక్తి కేంద్రాలకు ఇ–పాస్ మిషన్లు పంపిణీ చేసిన కలెక్టర్


