సాంకేతిక..వెనకబాటు | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక..వెనకబాటు

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

జనగామ రూరల్‌: జిల్లా పలు రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ పారిశ్రమిక రంగంతో పాటు సాంకేతిక విద్యారంగంలో వెనుకబడింది. ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలలు ఉండగా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఏకై క పాలిటెక్నిక్‌ , ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల మినహా జిల్లాలో మరెక్కడా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు సాంకేతిక విద్యకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ కోర్సులు పూర్తి చేసినవారు తక్కువ సమయంలోనే ఉద్యోగాలు సాధించే అవకాశముంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌లో అడ్మిషన్‌ పొందే వెసులుబాటు ఉంది. ప్రభుత్వానికి చెందిన సాంకేతిక కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్యోగాలకు

అవకాశం

ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సింగరేణి, రైల్వే సంస్థల్లో వేతనంతో కూడిన శిక్షణ (అప్రెంటిషిప్‌) ఇవ్వడానికి ముందుకు వస్తుండడంతో పాటు ఆర్టీసీలాంటి చాలా సంస్థలు కూడా ఐటీఐ విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు మొగ్గుచూపుతున్నాయి. అంతేకాకుండా శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులు సొంతంగా పరిశ్రమ పెట్టుకుని స్వయం ఉపాధితో స్థిరపడే అవకాశం ఉంది. దీంతో ఈ కోర్సులు చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఎక్కువ మందికి ప్రయోజనం

సాంకేతిక విద్య రంగంలో వెనుకబడిన జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. స్థానికంగా ఘన్‌పూర్‌ తప్ప మిగతా ఎక్కడ కళాశాలలు లేకపోవడంతో పక్క జిల్లాలకు వెళ్లి ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు అభ్యసిస్తున్నారు. జనగామ, హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాలు వరుసగా ఉండడంతో విద్యా హబ్‌గా మార్చకోని విద్యారంగంలో మరింత ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. కాగా, జిల్లాలో గత విద్యాసంవత్సరానికి గాను ఆరువేలకు పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కాగా, ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ సాంకేతిక కోర్సులు ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేరడానికి అర్హత ఉంటుంది. వీరితోపాటు ఇంటర్‌ పూర్తి చేసి సాంకేతిక కోర్సులపై ఆసక్తి ఉన్నవారు కూడా ఐటీఐ, పాలిటెక్నిక్‌ అడ్మిషన్లు పొందే వెసులుబాటు ఉంది.

సాంకేతిక విద్యాసంస్థలు నెలకొల్పాలి..

జిల్లాలో సాంకేతిక కళాశాలలు లేక విద్యార్థులు సాంకేతిక కోర్సులు చదివేందుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సాంకేతిక విద్యారంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదు.

– పోదల లవకుమార్‌,

జిల్లా అధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ

జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు ఇంకెప్పుడు?

టెక్నాలజీకి దూరమవుతున్న విద్యార్థులు

చదవాలనుకుంటే దూరప్రాంతాలకు

వెళ్లాల్సిందే..

కేంద్రీయ విద్యాలయం కోసం పోరాటం

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలం ఉండడంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు పట్టణానికి చెందిన బిర్రు ఇస్తారి వ్యక్తిగతంగా పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఉండగా జనగామ అనువైన ప్రాంతం కావడంతో విద్యాలయం ప్రకటిస్తే అనేక మందికి విద్యా, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రికి పలు వినతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement