జనగామ రూరల్: పక్కా యాక్షన్ ప్లాన్‌తో సమన్వయంతో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఓటరు జాబితా, పంటల మార్పిడి, పారిశుద్ధ్యం అంశాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గురించి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
ప్రధాన లక్ష్యం, ఎన్నికల సిబ్బంది విధులు, పౌరుల భాగస్వామ్యం, ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. రానున్న వర్షాకాల నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీజనల్ వ్యాధుల నివారణ కోసం డ్రెయినేజీల నిర్వహణ, వాటర్ ట్యాంక్‌లను క్లీన్‌గా పెట్టడం, దోమల నివారణకు డ్రై డే నిర్వహించడం, ఫాగింగ్, ఆయిల్‌బాల్స్ వేయడం, శానిటేషన్ నిర్వహణ, వేడి నీరు తాగడం ఆవశ్యకత గురించి దండోరా వేయడం తదితర అంశాల మీద సభల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, జెడ్పీ సీఈఓ రంగారావు, ఆర్డీఓలు గోపిరామ్, కిరణ్ ప్రకాశ్, ఏసీపీ భీమ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం రవాణా ప్రక్రియ వేగవంతం కావాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు మరింత పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, డీఎంఓ రామకృష్ణ, పౌర సరఫరాల సంస్థ డీఎం హతీరామ్, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శిల్ప, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు.
ఇసుక సరఫరాకు
ఇ–సాండ్ పోర్టల్
జిల్లాలో నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా, వేగంగా, సులభతరంగా అందించేందుకు గా రూపొందించిన ఇ–సాండ్ బుకింగ్ పోర్టల్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాలు, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయం ద్వారా ఇ–సాండ్ పోర్టల్‌లో ఇసుక, గ్రావెల్, మొరం, తదితర నిర్మాణ సామగ్రిని బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక ధర ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.450, మొరం ధర ఒక క్యూబిక్ మీటర్‌కు రూ. 428గా నిర్ణయించినట్లు వివరించారు. అంతకుముందు సీ–సెక్షన్ సూపరింటెండెంట్ ఫణి, ఈడీఎం గౌతమ్ రెడ్డి, ఇ–సాండ్ పోర్టల్ గురించి తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాశ్, ఏపీజీ శర్మ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
అధికారులకు అవగాహన


