జనగామ: జిల్లాలోని దేవరుప్పుల మండలం లకావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి కొలువైన గుట్ట వద్ద మైనింగ్ పనులకు ఇచ్చిన పర్మిషన్ తక్షణమే రద్దు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీనారాయణ వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. బుధవారం బీఆర్‌ఎస్ మండల నాయకులు, సర్పంచ్‌లతో కలిసి కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి దయాకర్ రావు మైనింగ్ పనులను అడ్డుకున్నందుకు తమకు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరుగకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే వానకొండయ్య గుట్ట మైనింగ్ పనులు ఆపకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరినట్లు తెలిపారు.
డీసీసీ అధ్వర్యంలో..
వానకొండయ్య గుట్టలో మైనింగ్ అనుమతులను రద్దు చేసి, గిరిజనులు, స్థానికుల అభిప్రాయాల సేకరణకు సమగ్ర ప్రజాభిప్రాయ సర్వే చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బుధవారం గ్రామాల సర్పంచ్‌లతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రం అందించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. సమస్యను పరిశీలిస్తామని, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జాటోత్ నవీన్, అశ్వినిరవి, సుధాకర్, సుజాతయాకన్న, మహేందర్, నాయకులు వీరన్న, యాకన్న, రవి, నరసింహ, నరసింహ, నరేందర్ ఉన్నారు.
వేర్వేరుగా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించిన మాజీ మంత్రి దయాకర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి


