● వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్
హసన్‌పర్తి : భూ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించే వారిని మందలించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ నర్సింహారావు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ సీపీకి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్, క్రీడా మైదానాన్ని సీపీ పరిశీలించారు. రౌడీషీటర్లు, అనుమానితుల రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై సానుభూతి ప్రదర్శించొద్దన్నారు. విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సై నవీన్, కల్యాణ్‌కుమార్, రాజమౌళి పాల్గొన్నారు.


