భానుడి భగభగ | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగ

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు

నిర్మానుష్యంగా వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారి

జనసంచారం లేక మంగళవారం మధ్యాహ్నం 1గంటకు నిర్మానుష్యంగా పాతబీటు బజారు

జనగామ: జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి ఎండలు మండిపోతుండగా, గడప దాటి బయటకు రావాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఒంటిగంట దాటితే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్య ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ప్రధాన కూడళ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.

డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా..

తీవ్రమైన ఎండల కారణంగా ప్రజల్లో నీరసం, డీహైడ్రేషన్‌ సమస్యలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకునే పదార్థాలపై డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. కొబ్బరిబొండాలు, గ్లూకోజ్‌ నీళ్లు, పుచ్చకాయ, మజ్జిగ వంటి పానీయాలకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపధ్యంలో మట్టి రంజన్లకు గిరాకీ పెరుగుతుంది. పేదవాడి ఫ్రిడ్జిగా పిలిచే రంజన్లలో చల్లబడిన నీటితో దాహం తీర్చుకోవడమే కాకుండా, శరీరాన్ని చల్ల బరచడానికి సహకరిస్తుంది. ఫ్రిడ్జి వాటర్‌ కంటే రంజన్‌ వాటర్‌ ఆరోగ్యకరమని ప్రజలు భావిస్తూ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

ఏసీ, కూలర్లకు పెరుగుతున్న గిరాకీ

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలోని టెంపరేచర్‌ కూడా భరించలేని స్థాయికి చేరుకుంది. దీంతో ఏసీలు, ఎయిర్‌ కూలర్లు, టేబుల్‌ ఫ్యాన్లు, సీలింగ్‌ ఫ్యాన్ల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్‌ వినియోగం అకస్మాత్తుగా పెరగడంతో లోడ్‌ మోసే సామర్థ్యం దాటిపోకుండా పవర్‌ శాఖ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర పనుల కోసం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు చెమటలు పట్టే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రయాణికులు మధ్యాహ్నం సమయాల్లో ప్రయాణాన్ని పూర్తిగా మానేశారు. అయితే, ఉద్యోగాలు, పనిమీద వెళ్లాల్సిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాలల్లో ఒంటిపూట బడికొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటలు దాటితే విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చే తల్లిదండ్రులు పిల్లలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి టోపీలు, కూలింగ్‌ కాపులు, నీటి సీసాలు తప్పనిసరి చేశారు.

నిర్మానుష్యంగా జాతీయ రహదారులు

వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారి మధ్యాహ్న సమయంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. వందలాది వాహనాలు వెళ్లే రహదారి ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ భరించలేక మానవరహితంగా కనిపిస్తుంది. అవసరం లేకుండా వాహనదారులు ఈ సమయాల్లో రోడ్లపైకి రావడం మానేశారు. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేసవి ఉక్కపోత జిల్లాలో జీవన విధానాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుండగా, ప్రజలు ఎండను తట్టుకునే ప్రయత్నంలో రోజువారీ జీవితాన్ని జాగ్రత్తలతో కొనసాగిస్తున్నారు.

రక్షణ చర్యలు పాటించాలి:వైద్యులు

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని, అత్యవసర సమయంలో తల, ముఖం, చేతులను కప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడం, మజ్జిగ, దోసకాయ, నిమ్మరసం వంటి దాహం తీర్చే పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు.

ఉదయం 9 నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పేదోడి ఫ్రిడ్జి రంజన్లకు గిరాకీ

ఏసీ, ఫ్యాన్లు, కూలర్లకు డిమాండ్‌

శీతల పానీయాలతో సేదదీరుతున్న జనం

మధ్యాహ్నం నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement