దేవరుప్పుల: ప్రత్యేక పాలనలో అప్పులు తెచ్చి ఖర్చుచేసిన తరుణంలో ఇటీవల జీపీలకు నిధులు రావడంతో గ్రామ కార్యదర్శులు సదరు బిల్లులు ఎత్తుకునే క్రమంలో కడవెండి జీపీ నిధుల విడుదలలో లోపించిన తీరుపై వివాదాస్పదంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కడవెండి జీపీకి ఇటీవల రెండు విడతల్లో రూ.20 లక్షలు విడుదలయ్యాయి. కడవెండి గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిర్వహణ ఖ ర్చులు, జీపీ జీతభత్యాలు కలిపి మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం రూ.12,04,414 డ్రా చేశారు. అయితే నిబంధనల మేరకు ఎంబీ రికార్డు చేసి సంబంధిత బిల్లులు అప్పులు ఇచ్చిన యజమానులకు చెల్లించాల్సి ఉండగా గ్రామంలోని కొందరి అకౌంట్‌లోకి జమచేయడంతో పలు ఆరోపణలు, అనుమానాలకు తావిచ్చింది. దీంతో గ్రామస్తులు జీపీ నిధుల గోల్‌మాల్ విషయమై పలు రకాలుగా పేర్కొంటూ పాత కార్యదర్శి రాత్రివేళల్లో వచ్చి రికార్డులు సవరణ చేస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై స్పందించిన సర్పంచ్ భాషిపాక రాములు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించగా ప్రస్తుత కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్ రేణుక, వార్డు సభ్యుల సమక్షంలో బదిలీపై వెళ్లిన పాత కార్యదర్శి పాండు హాజరై రెండు సంవత్సరాల పైచిలుకు గ్రామ ప్రజల మౌలిక వసతులు, పరిపాలన వ్యవహారాలకు ఖర్చు చేసిన వివరాలు వివరించారు. పంచాయతీ నిర్వహణకు అప్పులు ఇచ్చిన వారికి నేరుగా అకౌంట్లోకి వేశానని, తాను ఎలాంటి తప్పిదాలు చేయలేదని స్పష్టం చేశారు. కాగా గ్రామంలో ఎక్కడ అభివృద్ధి పనులు కనిపించకపోగా జీపీ సిబ్బంది జీతాలు పోను మిగతా ఖర్చులపై గ్రామస్తుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మండల అధికారులు నిమ్మకు నీరెత్తడంతో కడవెండి నిధుల గోల్‌మాల్ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం కొసమెరుపు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూడనున్నాయి.
‘కడవెండి’లో నిధుల గోల్‌మాల్‌పై
సోషల్‌మీడియాలో వైరల్


