ముసాయిదాపై గుస్సా!
ఓటర్లు పెరిగితే.. రిజర్వేషన్లు మారవా..?
జనగామ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా(డ్రాఫ్ట్) ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ మున్సిపల్ కార్యాలయ సమావేశం హాలులో సోమవారం కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. పార్టీల వారీగా ఓటరు జాబితా అందించకపోవడంపై ముక్తకంఠంతో అధికారులను నిలదీశారు. వార్డుల వారీగా ఓట్లు పెరగడం, మిస్సింగ్ తదితర తప్పులపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముసాయిదా జాబితాలో ఫొటో ఐడీతో ఎందుకు ప్రచురణ చేయలేదని ప్రశ్నించారు. ఇతర వార్డుల నుంచి ఓట్లు మరో వార్డుకు ఎందుకు క్లబ్ అయ్యాయని అడిగారు. ఒకటో వార్డుకు చెందిన శ్రీరాంపూర్, బెత్లెహోమ్ సంబంధించిన ఓట్లను 3వ వార్డులో కలిపారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే జనగామ మండలం గానుగుపహడ్, పెంబర్తి, యశ్వంతాపూర్, వడ్లకొండ, మరిగడి, దేవరుప్పుల, మన్‌పహాడ్ ఓట్లు జనగామ ఓటరు జాబితాలో కలవడం దేనికి నిదర్శనమన్నారు. కాగా వెంకన్నకుంట, రెడ్డి కాలనీకి సంబంధించిన ఓట్లు మూడో వార్డులోకి రాగా, 20వ వార్డు నుంచి 21 వార్డులో 150 ఓట్లు పెంచారని మండిపడ్డారు. ఆ ఓట్లు పెరగడంతో రిజర్వేషన్ ప్రక్రియలో తమకు అవకాశం రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
3వ, 27వార్డుల్లో ఇతర వార్డుల ఓటర్లు..
మూడో వార్డులో గతంలో 1,450 ఓట్లు ఉంటే, ప్రస్తుతం 1,750కి పెరిగాయన్నారు. ఇందులో 17వ వార్డు వెంకన్నకుంట, 19వ, 1వ, 2వ, 4వ, 5వ వార్డుల ఓటర్లు ఉన్నట్లు కమిషనర్‌కు తెలిపారు. 27వ వార్డులో మరిగడి, గిర్నిగడ్డ, లక్ష్మీబాయి కుంట, 14వ వార్డు ఓట్లను ఎందుకు కలిపినట్లో అధికారులు సమాధానం చెప్పాలని, తుది ఓటరు జాబితాలో ఒక్క తప్పు కూడా ఉండకుండా చూడాలన్నారు. వార్డుల్లో మిస్సింగ్, ఇ తర గ్రామాలు, వార్డుల నుంచి కలిసిన ఓట్లతో రిజర్వేషన్లు మారితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ నాయకుల సమావేశంలో తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటరు జాబితాను ఇస్తామని, 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఆయా పార్టీల నాయకులు వంగాల మల్లారెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, బూడిద గోపి, మహంకాళి హరిశ్చంద్రగుప్త, జమాల్‌షరీఫ్, కడారు ప్రవీణ్, బొమ్మగాని అనిల్‌గౌడ్, సువార్త, మామిడాల రాజు, వారనాసి పవన్‌శర్మ, జోగు ప్రకాష్, కొత్తపల్లి సమ్మయ్య, మంగ రామ క్రిష్ణ, సిద్దులు, సంపత్, గుజ్జుల నారాయణ, పెద్దోజు జగదీష్ తదితరులు ఉన్నారు.
మున్సిపల్ ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నిరసన
సమీప గ్రామాల ఓటర్లు పట్టణంలో ఎలా కలుపుతారని నిలదీత


