మితిమీరిన పెత్తనం !
జనగామ: జిల్లా విద్యాశాఖలో ఇద్దరు అధికారులు ‘షాడో డీఈఓలు’గా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారనే ‘సాక్షి’ కథనం వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ విషయం ఉపాధ్యాయ వర్గాలు, సంఘాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీస్తుండగా, అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ఇంటెలిజిన్స్ విభాగం నివేదికలు సేకరిస్తుండగా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌్ నికోలస్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సైతం దీనిపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
‘షాడోస్’కు అసిస్టెంట్లు
బడులను ప్రత్యక్షంగా సందర్శించాల్సిన బాధ్యత ఉన్న అధికారుల స్థానంలో, వారి కింద ఉన్న అసిస్టెంట్లుగా పేర్కొనబడే కొంతమంది టీచర్లను పంపించి వివరాలు సేకరించడం, ఆ రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించడం తరచూ జరుగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. షాడో డీఈఓలుగా పేరుపొందిన ఇద్దరు అధికారులు కలెక్టర్‌కు దగ్గర అనే భయంతో టీచర్లు, సిబ్బంది ఎవరూ కూడా నేరుగా ఫిర్యాదు చేయడానికి సాహసం చేయడంలేదని ప్రచారం నడుస్తోంది.
అధికార హోదా దుర్వినియోగం
అందరూ వినియోగించాల్సిన కారును ఇద్దరు షాడో డీఈఓలే నిరంతరం వాడుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మిగతా అధికారులు ఇద్ద రు షాడోలను కారు కావాలని అడిగే ధైర్యం లేకుండా పోయింది. ప్రతీ నెల ప్రభుత్వం నుంచి చెల్లించే కారు అద్దెకు ఇద్దరు ఉపయోగించుకోవడం ఏంటనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మిగతా అధి కారులు తమ సొంత వాహనాలపైనే వెళ్తుండడం గమనార్హం. కొద్ది నెలల క్రితం డీఈఓ కార్యాలయం వాహనం రఘునాథపల్లి సమీపంలోని ఓ డాబాకు వెళ్లిన ఘటన కూడా టీచర్లలో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారిక వాహనంలో అసలు డాబాకు ఎవరెవరు, ఎందుకు వెళ్లారనే దానిపై విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి.
శిక్షణ నిధుల్లో అనుమానాస్పద లావాదేవీలు
జిల్లాలో గతేడాది సమ్మర్ శిక్షణ సమయంలో సుమారు 2వేల మంది ఉపాధ్యాయులకు ఐదు రోజుల ట్రైనింగ్ నిర్వహించగా, రూ.65 నుంచి రూ.70 లక్షల వరకు టీఏ, డీఏ నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఎంత శాతం టీచర్లు హాజరయ్యారు.. నిధుల విడుదలలో పారదర్శకత పాటించారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయకుండా, కొంతమంది అధికారుల ఫోన్‌పే ఐడీల ద్వారా చెల్లింపులు జరిగినట్లు సమాచారం. భోజనం సరఫరాకు ముందస్తు టెండర్లు పిలిచారా? హోటల్ బిల్లులు ఏ ఆధారంగా చెల్లించారు..? అన్న అంశాలలో స్పష్టత లేకపోవడం అనుమానాలకు మ రింత బలం చేకూరుస్తుంది. గతేడాది మొత్తంగా శిక్షణ పేరిట రూ.కోటి మేర నిధులు మంజూరయ్యాయని తెలుస్తుంది.
అధికారులే పట్టించుకోని పరిస్థితి
క్వాలిటీ అధికారులుగా పనిచేయాల్సిన సిబ్బంది గ్రీన్ పెన్ను ధరించి అధికార హోదాలో తిరుగుతుండటం, శాఖలో ఉన్న నిజమైన అధికారులను లెక్కచేయని పరిస్థితి అసంతృప్తికి దారితీస్తోంది. షాడో డీఈఓలు డీఈఓ హాదాతో అధికారం వినియోగించుకోవడం వల్లే ఈ పెత్తనం మరింత పెరిగిందని ఆ రోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా విద్యాశాఖను కుదిపేస్తున్న సాక్షి ‘షాడో డీఈఓలు’ కథనం
నవీన్ నికోలస్, ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా
కలెక్టర్ సీరియస్..!
సమ్మర్ శిక్షణ నిధులపై విచారణ ఉంటుందా..!
ఏడీని కూడా అవహేళన చేసిన సంఘటన..?
పాలకుర్తి–తొర్రూరు పాఠశాల షిఫ్టింగ్ సమయంలో ఏడీ, కొంతమంది అధికారులు ఆఫీసు కారులో వెళ్లగా, షాడో అధికారుల్లో ఒకరు డ్రైవర్‌కు ఫోన్ చేసి అర్జెంట్‌గా జనగామకు రావాలని ఆదేశించిన ఘటన చర్చనీయాంశమవుతోంది. ‘ఏడీ ఉన్నారు కదా..’ అని సదరు డ్రైవర్ చెప్పగా, ‘నాకేం చెప్పేది..? కలెక్టర్ తనిఖీ చేయమన్నారు..’ అంటూ ఏడీని అవహేళన చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల్లో చర్చకు దారితీసింది.


