‘విజయోస్తు’ వ్యూహం
రాష్ట్రంలో
మొదటి స్థానమే లక్ష్యం
జనగామ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతనెల మొదటి వారం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత, మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రతీరోజు సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకుగాను యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయనున్నారు. దీంతో పాటు కలెక్టర్ ప్రత్యేకంగా విద్యార్థులకు గైడ్ చేస్తూ ‘విజయోస్తు 2.0’తో ముందుకెళ్తున్నారు. మొదటి రోజు సాంఘిక శాస్త్రం, రెండో రోజు హిందీ, మూడోరోజు గణితం, నాలుగో రోజు ఆంగ్లం, ఐదో రోజు ఫిజికల్ సైన్స్, ఆరో రోజు సోషల్, ఏడో రోజు బయోలజీ సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.
తరగతుల నిర్వహణ ఇలా..
జిల్లావ్యాప్తంగా 102 ఉన్నత పాఠశాలలు, రెండు మోడల్ స్కూల్స్, 12 కుస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా.. 6వేలకు పైగా మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. స్థానిక పరిస్థి తులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఈనెల మొదటి వారం నుంచి జనవరి రెండోవారం వరకు రోజు సాయంత్రం 4:15 నుంచి 5:15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెండు పూటలా తరగతులు నిర్వహిస్తారు. అందులో రెగ్యులర్ తరగతులు బోఽ దించకుండా పునశ్చరణ, మూల్యాంకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు విధిగా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు విద్యా ప్రగతిపై విద్యార్థులతో చర్చించాలి. ప్రధానోపాధ్యాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ, చదువులో వెనుకబడిన వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాలి. వి ద్యార్థులు రాసిన జవాబులను పరిశీలించి, చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది.
అమలు ఇలా..
గతేడాది కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా చేపట్టిన విజయోస్తు ప్రణాళిక ద్వారా రాష్ట్రస్థాయిలో జిల్లా మూడోస్థానంలో నిలిచింది. ఈసారి మొదటిస్థానాన్ని చేరుకోవాలనే సంకల్పంతో అధికారులు ముందుకె ళ్తున్నారు. కలెక్టర్ ఆదేశానుసారం విజయోస్తు 2.0 ప్రణాళికను అమలుచేస్తున్నారు. జూన్ 12 నుంచే విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు 5 నుంచి 10 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారికో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి రోజూ సందేహాలను నివృత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అభ్యాసన దీపికలను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు. విజయోస్తు కార్యాచరణలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖ పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
అభ్యాస దీపికలతో ఉపయోగం
జిల్లాలోని పలు పాఠశాలలు పీఎంశ్రీ, సమగ్రశిక్షా అభియాన్ కింద నడుస్తున్నాయి. ఇందులో 3,622 మంది పదో తరగతి విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరికి మాత్రమే గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రాలకు సంబంధించిన తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఉన్న 16,628 అభ్యాస దీపికలు అందించారు. ఇప్పటికే బోధనకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్ తయారు చేశారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు సులువుగా ఉత్తీర్ణులయ్యేలా అభ్యాస దీపికల ద్వారా మెరుగుపరిచేలా విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు.
రాష్ట్రంలో పదో తరగతిలో మొదటి స్థానమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. విజయోస్తు 2.0, అభ్యాసన కరదీపికలతో ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీ ర్ణత సాధించే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లు ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. ప్రత్యేక తరగతుల కోసం విధిగా రిజిస్టర్ నిర్వహించాలి.
– కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
మండలం విద్యార్థులు
బచ్చన్నపేట 562
చిల్పూర్ 280
దేవరుప్పుల 361
స్టే.ఘనపురం 962
జనగామ 1,585
కొడకండ్ల 387
లింగాల
ఘణపురం 339
నర్మెట 391
పాలకుర్తి 622
రఘునాథపల్లి 435
తరిగొప్పుల 134
జఫర్‌గఢ్ 368
మొత్తం 6,426
పదో తరగతి ప్రత్యేక బోధనకు యాక్షన్ ప్లాన్ 2.0
కొనసాగుతున్న స్పెషల్ క్లాసులు
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ముందుకు
గతేడాది రాష్ట్రస్థాయిలో 3వ స్థానం
జిల్లావ్యాప్తంగా 6వేలకు పైగా పరీక్ష రాయనున్న విద్యార్థులు
‘విజయోస్తు’ వ్యూహం


