రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
బీబీనగర్, రాజాపేట: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన ఆదివారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు నర్సింహులు, మహేశ్వరి దంపతుల కుమారుడు గర్ధాసు ప్రశాంత్(32)కు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన ప్రసూన(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బోడుప్పల్‌లోని టెలిఫోన్ కాలనీలో ఉంటున్నారు. ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తూ.. బీబీనగర్ పెద్ద చెరువు వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ప్రసూన బైక్‌తో పాటు చెరువులో పడిపోగా ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో పడిన ప్రసూనను బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ షణ్ముఖ్‌తో పాటు డోర్నాల భార్గవ్, కొండ సైరిత్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గర్ధాసు ప్రశాంత్ దంపతుల మృతితో రాజాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముగ్గురు యువకులకు గాయాలు
బీబీనగర్‌లో ఘటన
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం


