ప్రైవేటు డబ్బు
రికవరీకి
‘బెల్ట్’ మార్గం
లాటరీ తగలకున్నా.. కోట్లు ఖర్చు చేసి వైన్స్ ఎందుకు?
మద్యం షాపుల లైసెన్స్‌ల కొనుగోలు వెనక అసలు కథ!
జనగామ: జిల్లాలో ఇటీవల మద్యం టెండర్ల లాటరీ పూర్తయ్యాక వైన్స్ వ్యాపారంలో సిండికేట్ రాజకీయాలు ఊపందుకున్నట్లు సమాచారం. లాటరీలో లక్కు తగలని పాత వ్యాపారులు, కొత్తగా లైసెన్స్ పొందిన వారితో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, వ్యాపారాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఈక్రమంలో రూరల్ ప్రాంతాల్లోని వైన్స్‌షాపులు, బెల్ట్‌షాపులు కలసి ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు చేసి..ప్రైవేటు కొనుగోలు సొమ్మును రికవరీ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఎమ్మార్పీ కంటే అధిక వసూళ్లు?
నూతన మద్యం పాలసీ విధానంలో 2025–27 రెండేళ్లకుగాను కొత్త వైన్స్‌షాపులు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి లాటరీలో అవకాశం రాని పాత వ్యాపారులు, కొత్తగా లైసెన్స్ పొందిన వారి నుంచి రూ.90 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి.. ఎలా రాబట్టుకుంటారనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. రూరల్ ప్రాంతాల్లో రెండు నుంచి ఆపై వైన్స్ దుకాణాలు ఉండగా, చాలా చోట్ల సిండికేటు అవతారం ఎత్తుతారు. రెగ్యులర్ అమ్మకాలతో సంబంధం లేకుండా కేవలం బెల్ట్ దుకాణాల సేల్ కోసం సిండికేట్‌గా మారుతారు. మండలాల పరిధిలో అన్ని షాపులకు కలుపుకుని ఒక్కే ఒక్క దుకాణం ద్వారా బెల్ట్‌కు బాటిల్స్ అమ్మకాలు చేస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీకి మించి బెల్ట్ దుకాణాలకు మద్యం అమ్మకాలు చేస్తారు. బెల్ట్ దుకాణాలకు ఇచ్చే ఒక్క క్వార్టర్‌పై రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం అనేకం. ఇక్కడ కొనుగోలు చేసిన సరుకును బెల్ట్‌షాపునకు తీసుకెళ్లిన తర్వాత, మరో రూ.15 కలిపి అమ్మకాలు చేస్తారు. దీంతో రూ.160 విలువైన క్వార్టర్ బాటిల్ కాస్తా, బెల్ట్ కౌంటర్‌లో రూ.190కి పెరుగుతుంది. చాలా మంది మద్యం ప్రియులు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు ను బెల్ట్ దుకాణంలో క్వార్టర్‌కు సుమారు 22శాతం మేర అదనంగా ఖర్చు చేసి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. బీరుపై ఎమ్మార్పీ రూ.180 ఉండగా, బెల్ట్‌లో మాత్రం రూ.220లకు అమ్ముతున్నారు.
సిండికేట్ డీల్ వెనుక లెక్కలు
రెండేళ్ల లైసెన్స్ కాలంలో బెల్ట్‌షాపుల ద్వారా సుమారుగా రూ.24 కోట్ల వ్యాపారం జరుగుతుందని అనుకుంటే.. ఇందులో బెల్ట్ దుకాణాల ద్వారా 6 నుంచి 7 శాతం అదనపు వసూళ్లతో దాదాపు రూ.1.20 కోట్ల లాభం రావచ్చని అంచనా వేస్తున్నారు. లాటరీలో లక్కు తగలని వ్యాపారులు, కోట్లు బేరసారాలతో కొత్త లైసెన్స్ కొనుగోలు చేసి, బెల్ట్ దుకాణాల ద్వారా అదనంగా రాబట్టే సొమ్ముతో రికవరీ చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మద్యం వ్యాపారంలో ఉన్న ఈ గోల్‌మాల్ దందాతో సాధారణ ప్రజల జేబులే గుల్ల అవుతున్నాయి. బెల్ట్ షాపులు అనధికారికంగా కొనసాగుతూ ఎమ్మార్పీపై అదనపు ధరలు వసూలు చేస్తున్నా, అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వం నేరుగా మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పొందుతున్నప్పటికీ, సిండికేట్ వ్యాపారాల వల్ల ప్రభుత్వ ఆదాయం కంటే ప్రైవేట్ లాభాలు ఎక్కువగా నమోదవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.
కోట్లు పెట్టి
తిరిగి రాబట్టుకునే
వ్యూహం
బెల్ట్ దుకాణాలకు
ఎమ్మార్పీకి మించి
అమ్మకాలు!
లాభం వ్యాపారులకు..
నష్టం మద్యం ప్రియులకు
కోట్లు పెట్టి లైసెన్స్ కొంటే లాభం ఎక్కడ? అనే ప్రశ్న ఇప్పుడు జనగామ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది వ్యాపారులు ఈ కోట్లు తిరిగి రాబట్టుకోవడానికి ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ కష్టపడే కార్మికులు, కూలీలు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక్క గ్లాసు మద్యం కోసం అదనంగా రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ అమలులో విఫలమైతే, ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. కొత్త మద్యం దుకాణాలకు మరో నెలరోజులు మిగిలి ఉండగానే, సిండికేటు మాటాముచ్చట తెరపైకి వస్తుండడం గమనార్హం. నూతన మద్యం పాలసీ అమలు తర్వాత ప్రభుత్వ నియంత్రణ, విజిలెనన్స్ పరిశీలన అవసరమని ప్రజలు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు అంటున్నారు.
సిండికోట రహస్యం
సిండికోట రహస్యం


