
పూలసంబురం
అంబరాన్నంటిన
జిల్లావ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ
● మహిళలు, చిన్నారులతో కిక్కిరిసిపోయిన బతుకమ్మకుంట ప్రాంగణం
● ఆటాపాటలతో మురిసిన మహిళలు
● గౌరమ్మకు ఘనంగా వీడ్కోలు
జనగామ: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సద్దుల బతుకమ్మ పండుగ సంబురాలు సోమవారం అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయ రీతిలో సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తి, స్టేషన్‌న్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల పరిధిలోని ప్రతీపల్లె పూలవనంలా మారింది. శ్రీఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మశ్రీ అంటూ తాళాలతో పలికిన పాటలు గగనాన్ని తాకాయి. గ్రామాలన్నీ ఆట, పాటలతో మార్మోగిపోయాయి. చివరగా మహిళలు గౌరమ్మను గంగమ్మ ఒడికి చేరవేస్తూ వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా అని ప్రార్థించారు.
బతుకమ్మకుంటలో..
పట్టణంలోని బతుకమ్మకుంటలో జరిగిన సద్దుల వేడుకలకు 30 వార్డుల నుంచి మహిళలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. బతుకమ్మకుంట విద్యుత్తు దీపాల అలంకరణ, రంగురంగుల హరివిల్లులతో దేదీప్యమానంగా వెలుగొందింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పట్టణ నలుమూలల నుంచి పెద్ద బతుకమ్మలతో మహిళలు ఇక్కడకు చేరుకున్నారు. మహిళల పాటలు, వేలాది చప్పట్లతో బతుకమ్మకుంట భక్తి పారవశ్యంతో ఓలలాడింది.
వాడవాడలా
అలాగే పట్టణంలోని పాతబీటు బజారు, అంబేడ్కర్, ధర్మకంచ, బాలాజీ నగర్, శ్రీనగర్, తహసీల్ కార్యాలయం, రైల్వేస్టేషన్, జీఎంఆర్, శ్రీ విల్లాస్, హౌజింగ్ బోర్డు, జ్యోతినగర్ కాలనీలు, కుర్మవాడ, గోకుల్‌నగర్, హెడ్‌్ పోస్టాఫీసు, శ్రీ సాయిరెసిడెన్సి, చమన్ ఏరియా, గణేశ్ స్ట్రీట్, ధర్మకంచ, గుండ్లగడ్డ తదితర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి.
బతుకమ్మ నిమజ్జనం..
సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న మహిళలు నిమజ్జనంతో బతుకమ్మకు వీడ్కోలు పలికారు. ‘ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం..’ అనుకుంటూ మహిళలు అందరూ ఒక చోట చేరి ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు. వేడుకల్లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి పల్లా నీలిమ, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్లు పోకల జమునలింగయ్య, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మహిళా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆద్వర్యంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఆయా ప్రాంతాల ఏసీపీ, సీఐ, ఎస్సై, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా వేశారు.

పూలసంబురం