ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం

Sep 29 2025 8:14 AM | Updated on Sep 29 2025 8:14 AM

ఎస్సీ

ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం

మొదలైన వ్యూహరచన మారనున్న సమీకరణాలు..

మూడు మండలాలపై ఫోకస్‌

జనగామ, చిల్పూరు, లింగాలఘణపురం జెడ్పీటీసీలు ఎస్సీలకు రిజర్వ్‌

జనగామ: జిల్లా జెడ్పీ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో జిల్లా రాజకీయాల్లో కసరత్తుల ఎంపిక ఉత్కంఠ కలిగిస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో సర్వత్రా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. జెడ్పీ రిజర్వేషన్‌ ఎస్సీ మహిళకు కేటాయించడంతో జిల్లా రాజకీయాలు పరిషత్‌ చుట్టూనే తిరగడంతో పాటు రాజకీయ సమీకరణాలు సైతం మారిపోయాయి.

జిల్లాలో జెడ్పీ పీఠం కోసం అధికార కాంగ్రెస్‌ ఇప్పటికే వ్యూహరచన మొదలు పెట్టింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ సింగపురం ఇందిర లింగాలఘణపురం నుంచి జెడ్పీటీసీ బరిలో దిగుతారనే ప్రచారం వినిపిస్తోంది. జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే చివరకు ఇందిరనే జెడ్పీ చైర్మన్‌ పదవిని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఆ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ కూడా తమకు బలమైన అభ్యర్థిని నిలబెట్టి పీఠాన్ని దక్కించుకునేందుకు అంతకన్నా రెట్టింపు కసరత్తులు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనగామ మండలం నుంచి కాంగ్రెస్‌ పార్టీలో డాక్టర్‌ రాజమౌళి, గనిపాక మహేందర్‌, బక్క శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తుండగా, బీఆర్‌ఎస్‌ నుంచి పగిడిపాటి సుధసుగుణాకర్‌రాజు, కొమ్ము రాజు, మరో ఇద్దరు బరిలో నిలిచేందుకు ముందుకొస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. చిల్పూరు, లింగాలఘణపురం మండలాలలో కాంగ్రెస్‌ నుంచి ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సింగపురం ఇందిర, గడ్డమీది సురేశ్‌, పాశం సురేశ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఎడ్ల మహిపాల్‌, ఉడుగుల భాగ్యమ్మ టికెట్‌ రేసులో ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగితే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు పండగ తర్వాత తమ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఖరారు కావడం, వీటిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో రెండు పార్టీల్లో రాజకీయ వేడి పెంచుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో తొలిసారి జెడ్పీ చైర్మన్‌గా దివంగత పాగాల సంపత్‌రెడ్డి (జనరల్‌ కేటగిరీ) బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి జరగనున్న ఈ ఎన్నికల్లో ఎస్సీ మహిళకు పీఠం రిజర్వ్‌ కావడంతో దళిత మహిళా చైర్మన్‌ పదవిని ఎవరు వరిస్తారనే చర్చ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో పార్టీల అభ్యర్థుల ఎంపికలు, కూటములపై ఆధారపడి జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయనేది ఆసక్తిరేపుతోంది. బీజేపీ సైతం బలమైన జెడ్పీటీసీ అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు పక్కా ప్రణాళికలను వేస్తుండగా, స్వతంత్రులు రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతుండగా..వారి కదలికలను అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పసిగడుతున్నట్లు వినికిడి.

చిల్పూరు, జనగామ మండలాలు ఎస్సీ జనరల్‌, లింగాలఘణపురం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. మూడు మండలాల నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలు జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూడు మండలాల పకిధిలో జెడ్పీటీసీ టికెట్‌ పొందిన అభ్యర్థులు జడ్పీ చైర్మన్‌ రేసులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో రెండు పార్టీల్లోనూ టికెట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కాగా బచ్చన్నపేట మండలం జనరల్‌ కేటగిరీ, కొడకండ్ల మండలం జనరల్‌ మహిళ కేటగిరీగా రిజర్వ్‌ కావడంతో అక్కడ సైతం దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు కన్నేసినట్లు సమాచారం.

అందరి చూపు ఆ మూడు మండలాల వైపు..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు

తెరపైకి ఆశావహులు

ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం1
1/1

ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement