
అవమానించిన చోటే..గౌరవం పొందాలని
● గ్రూప్–2లో కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించిన శ్రావణి
రఘునాథపల్లి: అవమానించబడ్డ చోటే గౌరవం పొందాలన్న కసి ఆమెను విజయతీరాలకు చేర్చింది. అంకిత భావంతో అహర్నిషలు చదివి అనుకున్నది సాధించింది రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కౌంసాని శ్రావణి. ఆమెకు మూగ, వినికిడి సమస్యలు ఉండేవి. దీంతో అనేక అవమానాలకు గురైంది. వెక్కిరించిన వారి నోళ్లను మూయించాలంటే చదువే ఆయుధంగా భావించింది. తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించి కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం పొందింది. మొదట జేపీఎస్‌గా, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. జేపీఎస్‌గా పనిచేస్తున్న సమయంలో వినికిడి సమస్య కారణంగా అనేక ఇబ్బందులు పడింది. అహర్నిశలు శ్రమించి గ్రూప్–2 ఉద్యోగం సాధించింది. భర్త బాల్‌రెడ్డి ఎంతో అండగా నిలిచి ప్రోత్సహించారని శ్రావణి తెలిపింది.