పల్లెల్లో పాలన షురూ..
జగిత్యాల: పల్లెల్లో కొత్త పాలన ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని సర్పంచులు, పాలకవర్గాల సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీలను రంగురంగులతో తీర్చిదిద్ది ముస్తాబు చేశారు.
సవాళ్లు అనేకం..
కొలువుదీరిన కొత్త పాలకవర్గాలకు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. వీటితోపాటు పంచాయతీల్లో నిధుల సమస్య ప్రధానంగా ఉంది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా గత ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. వాటికి సంబంధించిన కిస్తీలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. వాటిని నడిపించిన చోట కార్యదర్శులే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులేవీ రాలేదు. దీంతో సర్పంచులుగా బాధ్యతల స్వీకరించిన ఆనందంకన్నా.. లోలోపల సమస్యలపైనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం సెల్‌ఫోన్ ప్రపంచం కావడంతో సమస్యను ఫొటో తీసి.. సంబంధిత అధికారితోపాటు అవసరమైతే కలెక్టర్ వరకు పంపిస్తున్నారు. ఈ లెక్కన చిన్న సమస్య ఎదురైనా సర్పంచ్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. డ్రైనేజీ నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. వీధిదీపాలు
లేకపోవడం, సీసీరోడ్లు, కోతులు, కుక్కల సమస్య వేధిస్తోంది. వీటితోపాటు నిధులను కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అధికారులకు తప్పనున్న ఇబ్బందులు
ఇన్ని రోజులు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజల నుంచి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్పంచులు లేకపోవడవం, కార్యదర్శులతో పాటు, స్పెషల్ ఆఫీసర్లు ఉండటంతో సమస్యలు చెప్పుకునేందుకు వీరు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో గ్రామంలోని సమస్య వీరికి తలనొప్పిగా మారింది. కొత్తగా పాలకవర్గం చేరడంతో వీరికి కొంత వెసులుబాటు కలుగుతుంది. ఏదైనా సమస్యలుంటే నేరుగా సర్పంచ్ వద్దకు వెళ్తుంటారు. వీరు అధికారులతో పనులు చేయించాల్సి ఉంటుంది.
సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం
వెల్గటూర్: నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజా సమస్యల పరిష్కరానికే తొలిప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం రోజు ఎండపల్లి మండలం కొత్తపేట సర్పంచ్ జీరెడ్డి మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. నూతన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, తహవీల్దార్ అనిల్, మాజీ సింగిల్ విండో చైర్మెన్ గోపాల్‌రెడ్డి, పంచాయితీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు.


