విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
పెగడపల్లి: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీగల కింద ఉన్న చెట్లను తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నంచర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, రైతులతో కలిసి ఎడ్ల రాజేందర్‌రెడ్డి (43) చెట్లను తొలగించే పనులు చేపడుతున్నాడు. అప్పటికే ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంటు సరఫరా నిలిపివేశారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ పైభాగాన ఉన్న చెట్టు తీగను తొలగించేందుకు రాజేందర్‌రెడ్డి పైకి ఎక్కాడు. ఈ క్రమంలో 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి వద్ద ఉన్న తన భర్తను గ్రామానికి చెందిన కోల రాములు అనే వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లాడని, విద్యుత్ సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలిపి వేయకుండానే పనులు చేయడంతో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్సై రవీందర్‌కుమార్ తెలిపారు. ట్రాన్స్‌కో ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈ మధు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఏడీఈ తెలిపారు.


