
రాయికల్‌లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం
ధాన్యం కుప్పలు..
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. కేంద్రాల్లో ధాన్యం సంరక్షణకు కనీస వసతులు లేవు. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు రైతులే టార్పాలిన్ కవర్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణం మబ్బులతో ఉండి వర్షం కురిసే అవకాశం ఉండటంతో రైతులు కవర్ల కోసం పరుగులు తీస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంటి నుంచి లేదా అద్దెకు..
జిల్లావ్యాప్తంగా 400 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో సగం ఐకేపీ మహిళలు నిర్వహిస్తుండగా, మరో సగం సింగిల్ విండోలు నిర్వహిస్తున్నాయి. అసలే కేంద్రాలకు సరైన స్థలం లేదంటే ఉన్న స్థలాల్లో రైతులు ధాన్యం పోసేందుకు నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో రైతులే ఇంటి నుంచి చీరలతో పాటు రసాయన ఎరువుల బస్తాల సంచులతో కుట్టించిన పరదాలు, కవర్లు తెచ్చుకుని వాటిలో ధాన్యం పోస్తున్నారు. ఇంట్లో కవర్లు లేనివారు అద్దెకు తీసుకవస్తున్నారు. ఒక్కో కవర్‌కు రోజుకు రూ.30 చెల్లిస్తున్నారు. ధాన్యం కుప్ప పోసేందుకు ఒకట్రెండు కవర్లు ఉంటే సరిపోయేవి. కానీ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు నాలుగైదు కవర్లు అవసరమవుతున్నాయి. అలాగే రోజుల తరబడి ధాన్యం తూకం వేయకపోవడంతో కవర్లకే ఒక్కో రైతు కనీసం రూ.2–3 వేలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా రోడ్డుకు సమీపంలో ఉన్న కేంద్రాల్లో కొందరు దొంగలు ధాన్యం కుప్పలపై కప్పిన కవర్లను రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ధాన్యం తూకం వేసిన తర్వాత సంచులపై కేంద్రం నిర్వాహకులు కవర్లు కప్పడం లేదు. దానికి సైతం రైతులనే బాధ్యులను చేయడంతో లారీల్లోకి సంచులు ఎక్కించేవరకు ధాన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
క్వింటాల్‌కు రూ.32 కమీషన్
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లుకు అప్పగించినందుకు ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.32 కమీషన్‌ను సివిల్ సప్‌లై సంస్థ కొనుగోలు ఏజెన్సీలకు ఇస్తుంది. అయినా నిర్వాహకులు ఇటు రైతులకు అటు ధాన్యం సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. గతంలో చాలా కేంద్రాల్లో వర్షం పడి ధాన్యం కొట్టుకుపోయింది. తాజాగా జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం వర్షం కురవడంతో కవర్లు కొంత మేర ధాన్యం నానింది. అయితే పెద్దగా కురవకపోవడంతో రైతులకు ఇబ్బంది కలగలేదు.
టార్పాలిన్లు ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే.. ఒక్కో టార్పాలిన్ కిరాయి రోజుకు రూ.30
అన్నదాతల ఆందోళన
జగిత్యాలరూరల్: సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లి గ్రామంలో శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. తేమ శాతం వచ్చినా కొ నుగోలు చేయకపోవడంతో పాటు, తూకం వే సిన ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం చేస్తుండటంతో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రాయికల్‌లో తడిసిన ధాన్యం
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణంలో శుక్రవారం ఉదయం కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసింది. అసలే కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులు ఇబ్బందలు పడుతుంటే ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్వల్పంగా కురిసిన వర్షం
సారంగాపూర్(జగిత్యాల): సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో శుక్రవారం స్వల్పంగా వర్షం కురిసింది. వేకువజామున కొంత ఎక్కువగా, మధ్యాహ్నం స్వల్పంగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంతమేర తడిసింది. ధాన్యం రాశులపై రైతులు టార్పాలిన్లు కప్పారు.

తడిసిన ధాన్యాన్ని చూపుతున్న రైతులు