అంతరిక్షంలో స్టార్‌ హోటల్.. స్పెషల్‌ ఏంటంటే..

World First Space Hotel Expected To Open For Business In 2027 - Sakshi

భూమి మీద రకరకాల హోటళ్లు చూసాం. మరి అంతరిక్షంలో హోటల్‌ ఉంటే ఎలా ఉంటుంది? అనుకుంటున్నారా? అయితే మరో ఆరేళ్లు ఓపిక పడితే స్పేస్‌ హోటల్‌ని కూడా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్బిటాల్‌ అసెంబ్లీ కార్పొరేషన్‌(ఓఏసీ) అనే కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ స్పేస్‌ హోటల్‌ పేరు ‘వాయిజర్‌ స్పేస్‌స్టేషన్‌’. సుమారు 400 మందికి ఆతిథ్యం ఇవ్వనున్న ఈ హోటల్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి. మన భూమి మీద హోటల్‌ రూమ్‌లకంటే ఈ రూమ్‌లు మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండనున్నాయి. వాయిజర్‌లో బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, లైబ్రరీలు, కచేరీ వేదికలు, హెల్త్‌ స్పాలు, జిమ్‌లు, స్పేస్‌లో నుంచి భూమినీ చూసేందుకు లాంజ్‌లు, బార్‌లు కూడా ఉంటాయి.

2025లో ప్రారంభమయ్యే ఈ హోటల్‌ నిర్మాణం 2027 నాటికి పూర్తవుతుంది. అప్పటినుంచి పర్యాటకులను హోటల్లో బస చేసేందుకు అనుమతిస్తారు. అయితే స్పేస్‌ హోటల్‌ ఉన్న వ్యక్తులు గాల్లో తేలకుండా ఉండేందుకు  హోటల్‌ భ్రమణ రేటులో హెచ్చుతగ్గుల ద్వారా కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా హోటల్‌ను నిర్మించనున్నట్లు ఓఏసీ చెప్పింది. మూన్‌ ఉపరితలంపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి స్థాయిలో హోటల్‌ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి  ఉంటుంది. దాదాపు ఒక జెయింట్‌ వీల్‌ వంటి నిర్మాణంలో ఉండే ఈ హోటల్‌ 90 నిమిషాలలో భూమి చుట్టూ తిరిగివస్తుంది. వాయిజర్‌ పర్యాటకులకు అంతరిక్షంలో విహరించిన అనుభూతిని అందించడంతోపాటు, తక్కువ గురుత్వాకర్షణలో స్పేస్‌ ఏజెన్సీలు చేపట్టే ప్రయోగాలకు ఆవాసంగా ఉపయోగపడనుంది.
 
ఈ హోటల్‌ నిర్మాణంలో అనుభవం కలిగిన నాసా శాస్త్రవేత్తలతోపాటు పైలెట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు పనిచేయనున్నారు. 2012లోనే వాయిజర్‌ స్టేషన్‌ ఐడియా వచ్చింది. అది కార్యరూపం దాల్చేందుకు 2018లో ఓఏసీని ఏర్పాటు చేశారు. అయితే హోటల్‌ నిర్మాణానికయ్యే ఖర్చు, ఒకరోజు హోటల్‌లో గడిపేందుకు చెల్లించాల్సిన బిల్లు ఎంత అనేది ఇంతవరకు ఓఏసీ ప్రకటించలేదు. ఆ బిల్లెంతో తెలిస్తే బహుశా గురుత్వాకర్షణ శక్తి పనిచేయదనేమో మరి! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top