‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!

World Economy Lose 81-84 Lakh Crores Due To Gender Discrimination - Sakshi

పురుషాధిక్య పోకడల వల్ల భారీగా సంపద కోల్పోతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 

ఐరాసకు చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ తాజా నివేదికలో వెల్లడి 

మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్‌ సిస్టమ్స్‌) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్‌ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. 

వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది 
వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్‌ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్‌ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్‌ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌ క్యు డోంగ్యు తెలిపారు.

ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్‌ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్‌ఏఓ సూచించింది.  

గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం 
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్‌ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు.

అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్‌ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్‌టైమ్‌ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం
ఉంటోంది. 

కౌలు రైతులకు మరీ కష్టం.. 
భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్‌ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్‌ఏఓ నివేదిక తెలిపింది. 

ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి 
వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
– డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్‌ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)
చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top