కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా? | Indian-origin student confronts US VP JD Vance over immigrants, religion remarks | Sakshi
Sakshi News home page

ఇంతకాలం కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?

Oct 31 2025 12:17 PM | Updated on Oct 31 2025 12:43 PM

Who is Indian Woman Asks Questions JD Vance Viral

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్‌ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. 

అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్‌ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. 

భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్‌ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్‌ను నిలదీశారు. ఆ సమయంలో.. 

కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్‌ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. 

ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్‌ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్‌ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు.  హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్‌ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్‌ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement