పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్‌లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.
ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.
ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ బిగ్ డిమాండ్
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్‌బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి.


