హార్ముజ్‌ దిగ్బంధం వేళ.. యూఎస్‌ సంచలన వీడియో విడుదల | US Releases Video Of Navy Redirecting Ship Amid Iran Port Blockade | Sakshi
Sakshi News home page

హార్ముజ్‌ దిగ్బంధం వేళ.. యూఎస్‌ సంచలన వీడియో విడుదల

Apr 17 2026 1:24 PM | Updated on Apr 17 2026 2:15 PM

US Releases Video Of Navy Redirecting Ship Amid Iran Port Blockade

ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా తాము చేపట్టిన దిగ్బంధం (Blockade) కార్యకలాపాలలో భాగంగా ఓ వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో యూఎస్‌ఎస్‌ మైఖేల్ మర్ఫీ (DDG 112) నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.

ఇరాన్ నౌకాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను అమలు చేస్తున్న క్రమంలో అమెరికా దళాలు ఓ వాణిజ్య నౌకను నియంత్రిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. కాగా, 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్‌ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హార్ముజ్‌ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’ అని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ చైర్మన్‌ జనరల్‌ డేన్‌ కెయిన్‌ ప్రకటించారు.

హార్మూజ్‌ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్‌ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్‌ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్‌ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో  శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్‌ అంగీకరించిందని చెప్పారు. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్‌ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement