
వాషింగ్టన్: భారత్‌పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసు జారీ చేసింది. భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ అదనపు భారం వర్తిస్తుందని అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27న అర్ధరాత్రి 12:01 నుండి అమల్లోకి వస్తాయని తెలియజేసింది.
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆగస్టు 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం అమెరికా విషయంలో చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందించాలని యూఎస్ ఏజెన్సీలను ఈ ఉత్తర్వులో ఆదేశించారు. దీనిలో భాగంగా భారతదేశంపై కొత్త సుంకాల విధింపును కూడా పేర్కొన్నారు.
ఈ నోటీసులో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయని అమెరికా పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే లేదా గిడ్డంగులనుండి బయటకు తీసుకెళ్లే ఏ వస్తువులకైనా ఈ సుంకాలు వర్తిస్తాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని లేదా మాస్కోపై అదనపు ఆంక్షలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నోటీసు ద్వారా సంకేతాలిచ్చారు. ఈ విషయంలో పురోగతి సాధించలేని పక్షంలో రాబోయే వారాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇప్పటివరకు యూఎస్.. చైనాతో సహా రష్యన్ చమురు కొనుగోలుదారులపై ఇలాంటి చర్యలను చేప్టటలేదు. ఈ ఏడాది ఆగస్టులో ట్రంప్ భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలను విధించారు. భారతదేశం నుండి వచ్చే ఉత్పత్తులపై మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచారు. న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును కొనసాగించినందుకు జరిమానాగా అమెరికా ఈ చర్య చేపట్టింది. అయితే భారత్ వీటిని ద్వితీయ సుంకాలని పేర్కొంటూ, వీటిని అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. అదే సమయంలో చర్చలలో పురోగతి చోటుచేసుకుంటే పెరిగిన సుంకాల అవసరం కూడా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చింది.

కాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ అమెరికా సంకాలపై స్పందిస్తూ.. వాషింగ్టన్ విధించే ఆర్థిక ఒత్తిడిని లెక్క చేయమని, ఇందుకు ప్రతిగా తమ ప్రభుత్వం ఒక మార్గాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటామని, నేడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎంతో శక్తిని పొందుతోందని, దీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉందన్నారు.