
డెయిర్ అల్ బలాహ్: మూడు రోజుల ఆలస్యం తరువాత గాజాలోకి ఎట్టకేలకు 90 సహాయక ట్రక్కులు వచ్చినట్టు అక్కడి ఐక్యరాజ్యసమితి సహాయ బృందం తెలిపింది. పిండి, పిల్లల ఆహారం, వైద్య పరికరాలతో అవి కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా గాజాలో ప్రవేశించినట్టు ధ్రువీకరించింది. ఆ వెంటనే సహాయ పంపిణీ ప్రారంభమైంది. అందుబాటులోకి వచి్చన పిండితో బేకరీలు తెరుచుకున్నట్టు సహాయ బృందం వెల్లడించింది. గాజాలోకి మానవతా సాయంపై 11 వారాల దిగ్బంధాన్ని ఇటీవలే ఇజ్రాయెల్ పాక్షికంగా ఎత్తేసింది.
అది ఏమాత్రమూ చాలదని, గాజా అత్యవసరాలతో పోలిస్తే సరఫరా చాలా తక్కువగా ఉందని ఐరాస ఆక్షేపించింది. సంఘర్షణకు ముందు గాజా రోజుకు సగటున 500 సహాయ ట్రక్కులు వచ్చేవి. ‘‘ప్రస్తుతం 140,000 టన్నులకు పైగా ఆహారం డెలివరీకి సిద్ధంగా ఉంది. మొత్తం గాజా జనాభాకు ఇది రెండు నెలల పాటు సరిపోతుంది. కానీ లోనికి ప్రవేశమే గగనంగా మారింది’’అని ప్రపంచ ఆహార కార్యక్రమం అధికారి ఒకరు తెలిపారు. గాజాలో ఇటీవల కాలంలో కనీసం 29 మంది పిల్లలు, వృద్ధులు ఆకలి చావుల పాలయ్యారు. 100కు పైగా ట్రక్కులను అనుమతించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.
ఐరాసను తప్పించే యోచన
గాజాలో ఐరాస సహాయ వ్యవస్థను పూర్తిగా తప్పించేందుకు ఇజ్రాయెల్ యోచిస్తోంది. సహాయ సరఫరాలను హమాస్ మళ్లిస్తోందని ఆరోపిస్తోంది. ఐరాసను పక్కన పెట్టి అమెరికా మద్దతుతో ఇరు దేశాల సంస్థల ద్వారా సాయం అందిస్తామని ప్రతిపాదించింది. రెడ్‌క్రాస్‌తో సహా అంతర్జాతీయ మానవతా సంస్థలన్నీ ఆ ప్రణాళికను తిరస్కరించాయి. ఇజ్రాయెల్ ప్రతిపాదనకు ఒప్పుకుంటే సాయం రాజకీయ ప్రతీకారానికి మార్గంగా మారే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చాయి.
దాడులకు 107 మంది బలి
గాజా అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు, క్షేత్రస్థాయి ఆపరేషన్లు నిరి్నరోధంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో వాటికి కనీసం 107 మందికి పైగా బలైనట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. డ్రోన్, వైమానిక దాడులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయని గాజా ఆరోగ్య శాఖ వాపోయింది. వాటిలో అల్ ఔదా ఆస్పత్రి తీవ్రంగా దెబ్బ తిన్నట్టు పేర్కొంది. మార్చి నుంచి దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిలో 1.61 లక్షల మంది గత వారం రోజుల్లోనే గాజా వీడారు.