
పాకిస్తాన్ దాడులు వీటితోనే..
ప్రమాదకర డ్రోన్లుగా గుర్తింపు
మెషీన్‌గన్స్, క్షిపణులు ప్రయోగించగల సత్తా
రియల్‌టైమ్ నిఘా పెట్టడంలో దిట్ట
భారత త్రివిధ దళాల ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో పాక్ మిత్రదేశం తుర్కియే తయారుచేసిన అత్యంత ప్రమాదకరమైన అసిస్‌గార్డ్ సోంగర్ సాయుధ యూఏవీలు ఉండటం కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే ఆధునిక యుద్ధ పద్ధతుల్లో సోంగర్ డ్రోన్లు సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి.
వీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. గురువారం రాత్రి భారత్‌లోని 36 మిలిటరీ, పౌర లక్ష్యాలపై సోంగర్ డ్రోన్లతోనే పాక్ దాడిచేసినట్లు మన రక్షణ శాఖ ప్రకటించింది. వాటిని సమర్థంగా కూల్చేసినట్లు శుక్రవారం మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. సోంగర్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మనకు ఉన్నప్పటికీ.. వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
సోంగర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవీ..
→ సోంగర్ డ్రోన్లను తుర్కియేలోని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న అసిస్‌గార్డ్ సంస్థ తయారుచేసింది. వీటిని 2019 నుంచి వినియోగిస్తున్నారు.
→ ఈ డ్రోన్లు స్వయంచాలితంగా ప్రయాణించి లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు చేరుకోగలవు. రిమోట్ కంట్రోల్‌తో కూడా నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి కీలకంగా పనిచేయగలవు. సరిహద్దులు దాటి దాడులు చేయటంలో వీటికి మంచి రికార్డు ఉంది.
ప్రమాదకర సాయుధ డ్రోన్
సోంగర్ డ్రోన్‌కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషీన్ గన్ అమర్చబడి ఉంటుంది. చిన్నపాటి క్షిపణులను కూడా ఇది ప్రయోగించగలదు. 81 ఎంఎం మోరా్టర్ రౌండ్స్‌ను పేల్చగలదు. వ్యక్తులు, వాహనాలు, ఎంపికచేసిన చిన్నపాటి లక్ష్యాలపై సమర్థంగా దాడి చేయగలదు.
ఫ్లైట్ పెర్ఫార్మెన్స్
సోంగర్ డ్రోన్లు 45 కిలోల బరువును మోసుకెళ్లగలవు. పేలోడ్ లేకుండా ఏకబిగిన 25 నుంచి 30 నిమిషాల వరకు గగనతలంలో ఎగరగలవు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషననుంచి 3–5 కిలోమీటర్ల దూరం వరకు ఇవి దాడులు చేయగలవు. సముద్రమట్టం నుంచి 2,800 మీటర్లు, భూ మట్టం నుంచి 400 మీటర్ల ఎత్తువరకు ఇవి ఎగరగలవు.
రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్
లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సోంగర్ డ్రోన్లది అందెవేసిన చెయ్యి. ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్‌కు రియల్‌టైమ్ (ప్రత్యక్షంగా)లో వీడియోలు, చిత్రాలను పంపగలవు. దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతాయి. రాత్రి– పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్లు నిఘా పెట్టగలవు. రాత్రిపూట వీడియోలు, చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి.
స్వయంచాలితం
ఈ డ్రోన్లను గ్రౌండ్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. అవసరమైతే వాటికవే స్వయంగా ఎగురుతూ నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవు. గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినా వాటికవే తిరిగి స్టేషన్‌ను వెతుక్కుంటూ తిరిగి రాగలవు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గిపోయినా వెంటనే గ్రౌండ్ స్టేషన్‌కు వచ్చేస్తాయి. దీంతో వీటిని నియంత్రించేవారికి పని సులువు అవుతుంది.
గుంపుగా దాడిచేయగల సామర్థ్యం
సోంగర్ డ్రోన్లు ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతోపాటు దాడులు చేయటంతోపాటు గుంపులుగా కూడా వెళ్లి దాడులు చేయగలవు. పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు స్వయంగా సమన్వయం చేసుకుంటూ లక్ష్యంపై నలు దిక్కుల నుంచి దాడి చేస్తాయి. శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపర్చి సమర్థంగా దాడులు చేయగల సత్తా వీటికి ఉంది. గురువారం భారత్‌లోని పలు లక్ష్యాలపై ఇలాగే దాడులు చేసినట్లు గుర్తించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్