తుర్కియే అధ్యక్షుడితో పాక్‌ ప్రధాని భేటీ.. భారత్‌ గురించి చర్చ? | Pak PM Shehbaz Sharif Thanks To Turkey Erdogan For Support During India's Operation Sindoor, Tweet Inside | Sakshi
Sakshi News home page

తుర్కియే అధ్యక్షుడితో పాక్‌ ప్రధాని భేటీ.. భారత్‌ గురించి చర్చ?

May 26 2025 9:08 AM | Updated on May 26 2025 1:15 PM

Pak PM Shehbaz Sharif thanks To Turkey Erdogan

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌తో యుద్ధం సమయంలో పాకిస్తాన్‌ ఆయుధపరంగా మద్దతు ఇచ్చినట్టు ఎర్డోగన్‌కు షరీఫ్‌ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్‌, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకున్నారు.

తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక చర్చలు జరిపారు. అనంతరం, షరీఫ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇస్తాంబుల్‌లో నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు ఎర్డోగన్‌ను కలిసే గౌరవం నాకు లభించింది. ఇటీవలి పాకిస్తాన్-భారత్ ప్రతిష్టంభనలో పాకిస్తాన్‌కు ఆయన దృఢంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని వేళలా ఎర్డోగన్‌ మాకు అండగా నిలిచారు. పాకిస్తాన్‌, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను.

ఈ చర్చలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో రెండు దేశాల మధ్య బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించాం. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, రవాణా, రక్షణ రంగాలలో పురోగతులే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిఘా భాగస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేకత వంటి రంగాలలో సహకారంపై చర్చించాం. ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రెండు దేశాలు కలిసి పనిచేయడం కొనసాగించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.

మరోవైపు, పాక్‌ ప్రధాని షరీఫ్‌తో చర్చలపై ఎర్డోగన్‌ స్పందిస్తూ..‘రెండు దేశాల మధ్య సోదరభావం, గౌరవం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇస్లామాబాద్‌కు మా పూర్తి మద్దతు కొనసాగుతుంది. తుర్కియే, పాకిస్తాన్ మధ్య ప్రతి రంగంలో చారిత్రక, మానవ, రాజకీయ సంబంధాలున్నాయి. వీటిని బలోపేతం చేయాలనేదే మా సంకల్పం’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. భారత్‌-తుర్కియే మధ్య విభేదాలు నెలకొన్న వేళ.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలంటూ ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం మార్మోగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement