
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.
దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.
సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దు..!
భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!
భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్‌మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్.