
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. ఆయన రెండోసారి అధ్యక్షుడైన దగ్గర్నుంచి సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల్ని రాజీకి వచ్చేలా చేయడం, ఆపై దేశాల మధ్య సమస్యలకు, యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించడం మాత్రమే చేస్తున్నారు. ట్రంప్.. ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అసలు అమెరికా ఎలా ఉందో చూసుకుంటున్నారో, లేదో కానీ మిగతా దేశాలపై ఆసక్తి మాత్రం ట్రంప్‌లో విపరీతంగా పెరిగిపోయింది.
ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకుంటున్నారు ట్రంప్. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.
భారత్, పాకిస్తాన్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని ;పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇది మంచిదే. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. అయితే ఏ సందర్బంలో పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.
ఉగ్రదాడులతో జనాల ప్రాణాల్ని తీసేస్తుంటే, భారత్ కు యుద్ధ పరిస్థితిని కల్పించింది దాయాది పాక్ . అది ఆపరేషన్ సిందూర్ తో మొదలుపెట్టింది. ఇక్కడ పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ షురూ చేసింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ రక్షణ స్థావరాలపై దాడులకు చేసి ఆ దాయాది దేశానికి చెందిన పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి తగిన బుద్ధి చెప్పింది.
మిమ్మల్ని అడిగింది ఎవరు?
అసలు విషయం వదిలేసి, కొసరు విషయం చెప్పే అలవాటు ట్రంప్ కే ఉందా.. లేదా అగ్రరాజ్యమే అలా ఉంటుందా? అనేది మరో ప్రశ్న. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ట్రంప్.. యుద్ధం ఆపడానికి తనను ఎవరు ఆశ్రయించారనే విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు.
భారత్, పాక్‌ల కాల్పుల విరమణ అంటూ తనకు తానుగా ప్రకటించారు ట్రంప్. తమకు క్లయింట్ అయిన పాకిస్థాన్‌కు పూర్తి సహకారం అందిస్తూనే, మరొకవైపు ఇండియాతో స్నేహాన్ని నటిస్తున్నారనేది భారత ప్రజలకు బాగా అర్ధమైంది. భారత్ దాడి ముమ్మరం చేసిన వేళ.. పాక్ ప్రధాని మిమ్మల్ని ఆశ్రయించారా? లేదా? అనేది మీరు చెప్పకపోయినా భారత్ ప్రజలకు ఆ విషయం అర్దమైంది. పాక్ భారీగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే కాల్పుల విరమణకు ఒప్పించారని అంతా అనుకుంటున్నారు. కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తే ఓ పనైపోతుందన్నట్టుగా ట్రంప్ చేసిన వాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని, పీవోకేను భారత్‌కు పాక్ అప్పగించడమే ఒక్కటే మార్గమని క్లియర్ చేసేశారు.
ఇప్పుడు కలిసి డిన్నర్ చేయాలా?
తాజాగా ట్రంప్ మరో రాగం అందుకున్నారు. భారత్, పాకిస్థాన్‌లు కలిసి డిన్నర్ చేయాల్సిందేనని అంటున్నారు. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్.. తొలిసారి మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో పర్యటించారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌లు కలిసి డిన్నర్ చేస్తే చూడాలని అంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో భారత్ ఎలా కలిసి డిన్నర్ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ అన్న మూడు గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందని మరి ఆ దేశాన్ని ఎలా నమ్మాలని కొంతమంది నిలదీస్తున్నారు. మీ వైఖరేంటో మాకు బాగా అర్ధమైందని మరికొందరు ట్రంప్‌ను విమర్శిస్తున్నారు.