
ప్రభుత్వ నివేదికలోనే బట్టబయలు
ఒట్టావా: కెనడా గడ్డనుంచి భారత్‌పై విషం కక్కుతున్న ఖలిస్తానీ ముఠాలు ఆర్థికంగా స్థానికంగానే వేళ్లూనుకుని ఉన్నట్టు మరోసారి రుజువైంది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ద ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ అనే రెండు స్థానిక ఖలిస్తానీ అతివాద సంస్థలకు కెనడా నుంచే ఆర్థిక మద్దతు పుష్కలంగా అందుతున్నట్టు స్వయానా కెనడా ప్రభుత్వమే విడుదల చేసిన నివేదిక తేల్చడం విశేషం. తేలింది.
‘కెనడాలో మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిసు్కలపై మదింపు–2025’పేరిట విడుదలైన ఈ నివేదిక, కెనడాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఖలిస్తానీ గ్రూపులు ఇష్టారాజ్యంగా నిధుల వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ ఆందోళన వెలిబుచ్చింది.
పంజాబ్‌లో ప్రత్యేక ఖలి స్తానీ రాజ్య స్థాపనే లక్ష్యంగా 1980ల నుంచీ కెనడా లో రాజకీయ ప్రాపకంతో కూడిన హింసాత్మక అతివాదం (పీఎంవీఈ) నిర్నిరోధంగా పెచ్చరిల్లుతోందని స్వయానా కెనడా నిఘా సంస్థే రెండు నెలల క్రితం ఓ నివేదికలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా నివేదిక సంచలనం రేపుతోంది. అంతర్జాతీయంగా హమాస్, హెజ్బొల్లా వంటి ఉగ్ర, అతివాద సంస్థలు ఈ పీఎంవీఈ జాబితాలోకి వస్తాయి. కెనడాలో అతిపెద్ద మనీ లాండరింగ్ జాఢ్యాల్లో డ్రగ్స్ అక్రమ సరఫరా ఒకటి.