
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు
తొలి చిత్రానికే అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: భారత యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ ప్రతిభ అంతర్జాతీయ వేదికపై తళుకులీనింది. ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ప్రఖ్యాత వెనిస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమెకు ఉత్తమ దర్శకురాలి అవార్డు దక్కింది. అరంగేట్రం, నవతరం ప్రతిభ, స్థానిక సొబగులు, కొత్తతరహా అంశాల కలబోత అయిన అంతర్జాతీయ ‘ఒరిజోంటీ’ విభాగంలో అనుపర్ణ ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. తొలి సినిమాకే ఈ పురస్కారం దక్కడం విశేషం. ఒరిజోంటీ కేటగిరీలో ఒక భారతీయ డైరెక్టర్‌కు అవార్డు దక్కడమూ ఇదే తొలిసారి!
అణగారిన మహిళలకే అంకితం
82వ వెనిస్ అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేతుల మీదుగా అనుపర్ణ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును గొంతుక లేని, నిర్లక్ష్యానికి గురైన మహిళలకు అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ‘‘నా విజయం మహిళా గొంతుకలకు బలాన్నిస్తుంది. అణచివేతకు గురైన మహిళల గాథలను గట్టిగా వినిపిస్తుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంబైకి వలసవచి్చన ఇద్దరు మహిళల ఆటుపోట్లను ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’’ కళ్లకు కట్టింది. ‘గోల్డెన్ లయన్’ పేరిట విజేతలకు 1949 నుంచి పురస్కారాలు అందిస్తున్నారు. కొత్త ప్రతిభను, స్వతంత్ర చిత్రాలను ప్రోత్సహించేందుకుగాను గోల్డెన్ లయన్‌కు సాటిగా ఒరిజోంటి అవార్డును రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. ఈఏడాది గోల్డెన్ లయన్ అవార్డ్‌ను అమెరికాకు చెందిన ‘ ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్’ సినిమా ఎగిరేసుకుపోయింది.