
న్యూస్‌మేకర్
వెనిస్ నగరంలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన యువ దర్శకురాలు అనుపర్ణా రాయ్ అవార్డు గెలుచుకుంది. మొదటి, రెండవ దర్శకత్వ సినిమాల కేటగిరి ‘ఒరిజోంటి’ కేటగిరిలో తన మొదటి సినిమా ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’కు ఆమె అవార్డు గెలుచుకుంది. అనురాగ్ కశ్యప్ సమర్పించిన సినిమా ఇది. అనుపర్ణ పరిచయం.
‘స్త్రీల లోపల ఉండే ఖాళీలు స్త్రీలకే తెలియవు. ఆ ఖాళీలు ఏ విధాన పూరింపబడతాయో కూడా తెలియదు. స్త్రీలు తమలో తాము చేసే అంతర్గత ప్రయాణానికి వీలు ఉండదు. అలాంటి ఇద్దరు స్త్రీలు తమను తాము తెలుసుకోవడమే కాక ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నమే నేను తీసిన సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటోన్ ట్రీస్ సినిమా’ అంది అనుపర్ణా రాయ్.
29 ఏళ్ల అనుపర్ణా రాయ్ ఇటీవల వెనిస్‌లో జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె దర్శకత్వం వహించిన 77 నిమిషాల ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’ హిందీ సినిమా మూడు షోస్ వేస్తే హౌస్‌ఫుల్‌గా నడిచాయి. అందరూ ఆమెను ప్రశంసించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారి దర్శకత్వం వహించే సినిమాల విభాగం ‘ఒరిజోంటి’లో ఈ సినిమా సెలక్ట్ కావడమే గొప్ప అనుకుంటే అవార్డు గెలవడం మరింత గొప్ప. ఆ విధంగా అనుపర్ణా రాయ్ చరిత్ర సృష్టించింది. వివిధ దేశాల నుంచి 19 సినిమాలు ఎంట్రీ పొందిన ఈ విభాగంలో మన భారతీయ చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’కు అవార్డు దక్కడం దేశంలో యువ ప్రతిభకు లోటు లేదనే విషయాన్ని నిరూపిస్తోంది. సినీ రంగంలో మహిళల సృజనకు తార్కాణంగా నిలుస్తోంది.
కథ ఏమిటి?
‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’ కథ ముంబైలో జరుగుతుంది. ముంబైకి వలస వచ్చిన ఔత్సాహిక నటి తోయ, సేల్స్ రంగంలో పని చేసే శ్వేత ఒక అపార్ట్‌మెంట్‌లో రూమ్‌మేట్స్‌గా కలిసి జీవిస్తూ ఉంటారు. తోయకు నటిగా అవకాశాలు రావు. అందువల్ల తప్పనిసరై సెక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే శ్వేతకు ఎదురు పడుతున్న పురుషులు ఆమెను అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ క్రమంలో తోయ, శ్వేత ఒకరికొకరు తోడవుతారు.
ఉద్వేగాలను అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటారు. వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అయితే తోయ చేసే సెక్స్‌వర్క్ ఇరుగు పొరుగుకు తెలిసి చివరకు ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆమెతో పాటు శ్వేత కూడా బయటకు నడవడంతో సినిమా ముగుస్తుంది. అయితే ఇప్పుడు వారు ఒంటరి కాదు. ఒకరికి ఒకరు ఉన్నారు. అదీ తేడా. ఈ కథంతా అపార్ట్‌మెంట్‌లోని వంట గదిలో, డ్రాయింగ్ రూమ్‌లో, కిటికీ దగ్గర, కారిడార్లలో జరుగుతుంది. స్త్రీలకు దొరికే ఈ మాత్రపు స్థలంలోనే వారు ఏ విధంగా జీవితాలను నిభాయించుకుంటారో దర్శకురాలు చూపుతుంది.
బెంగాల్ అమ్మాయి
అనుపర్ణా రాయ్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో పుట్టి పెరిగింది. మాస్ కమ్యూనికేషన్ చదివి ఢిల్లీలో కాల్ సెంటర్‌లో పని చేసింది. 2022లో ముంబైకి వలస వచ్చింది. దర్శకురాలిగా ఆమెకు ఎటువంటి శిక్షణ లేదు. చిన్నప్పుడు సినిమా హాలుకు వెళ్లడం కూడా కష్టమయ్యేది. కాలేజీ వయసులోనే సినిమా అంటే ఏమిటో పైరెటెడ్ సినిమాలను తన లాప్‌టాప్‌లో చూసి తెలుసుకుంది. ‘రన్ టు ది రివర్’ అనే షార్ట్‌ఫిల్మ్ తర్వాత ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’ తీయాలనుకుంది. అయితే ఇందుకు ఆమె దగ్గర డబ్బు లేదు. కొద్దిపాటి ఫండ్ దొరికితే తన అద్దె ఫ్లాట్‌లోనే ఇద్దరు ముఖ్యపాత్రధారులను తనతోపాటు ఉంచుకుని సినిమా తీసింది. తర్వాత అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను మెచ్చి సమర్పకుడిగా వచ్చాడు. దాంతో సినిమా వెనిస్‌కు చేరింది. అవార్డు కూడా సాధించింది.
అంతా రాజకీయమే
‘చిన్నప్పుడు నాకో స్నేహితురాలు ఉండేది. దళితురాలు. ఆమె పేరు ఝూమా దాస్. ఆమెతో మాట్లాడవద్దని మా నాన్న చె΄్పాడు. అలా ఆ స్నేహం వదులుకున్నాను. కాని ఆ పని చేసినందుకు మా నాన్నను ఇప్పటికీ క్షమించలేకపోతున్నాను. ఝూమా దాస్‌కు చిన్న వయసులోనే పెళ్లయ్యింది. దానికి కారణం పెళ్లి ఖర్చు భరించే ప్రభుత్వ పథకమే. ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్ళిళ్లకు డబ్బు ఇవ్వడం కన్నా వారి చదువుకు డబ్బు ఇవ్వాలి. తక్కువ కులాల ఆడపిల్లల ఎదుగుదలను పట్టించుకోక వారిని త్వరగా వదిలించుకోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నమే పెళ్లి ఖర్చు భరించడం. స్త్రీలు ఎన్నో సంఘర్ఘణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి కథలు నాలో నిండిపోయి ఈ సినిమాగా బయటకు వచ్చాయి’ అని తెలిపింది అనుపర్ణ రాయ్.
∙