
టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్) గోల్డెన్ ఎడిషన్ (50వ ఎడిషన్) అవార్డ్స్ వేడుకలో భారతీయ చిత్రాలు ‘హోమ్ బౌండ్, ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’లకు అవార్డులు దక్కాయి. హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, విశాల్ జైత్యా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘హోమ్ బౌండ్’. కరణ్ జోహార్, అదార్ పూనా వాలా, అపూర్వా మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇంటర్‌నేషనల్ పీపుల్ చాయిస్ రెండో అవార్డు లభించింది. సౌత్ కొరియన్ సెటైరికల్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘నో అదర్ చాయిస్’ సినిమాకు ‘ఇంటర్‌నేషనల్ పీపుల్ చాయిస్’ మొదటి అవార్డు దక్కింది. మరో భారతీయ చిత్రం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’కి జ్యూరీకి చెందిన ఎన్‌ఈటీపీఏసీ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి జితాంగ్ సింగ్ గుర్జార్ దర్శకత్వం వహించగా మేఘనా అగర్వాల్, రాఘవేంద్ర భడోరియా, నిఖిల్ ఎస్. యాద్ ప్రధానపాత్రల్లో నటించారు.
ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన అవార్డుగా భావించే ‘పీపుల్ చాయిస్ అవార్డు’ హిస్టారికల్ డ్రామా ‘హామ్నెట్’ చిత్రానికి దక్కింది. ఈ బ్రిటిష్ అమెరికన్ చిత్రానికి క్లోయ్ జావో దర్శకత్వం వహించగా, జెస్సీ బక్లీ,పాల్ మెస్కల్, ఎమిలీ వాట్సన్ ప్రధానపాత్రల్లో నటించారు. అలాగో ఈ ఫెస్టివల్‌లో మరో ప్రతిష్ఠాత్మకమైన ప్లాట్‌ఫామ్ ప్రైజ్ అవార్డు ఉక్రెయిన్స్ ఫిల్మ్ ‘టు ది విక్టరీ’కి దక్కింది. ఈ చిత్రంలో వాలెంటైన్స్ వాస్యనోవిచ్ ప్రధానపాత్రలో నటించి, దర్శకత్వం వహించారు.