
మొన్నటి వరకు...‘జితాంక్ సింగ్ గుర్జార్ పేరు విన్నారా?’ అనే ప్రశ్నకు వెంటనే వచ్చే జవాబు... ‘సారీ... తెలియదు’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పరిచయం అయింది. ‘ఎవరీ జితాంక్ సింగ్ గుజ్జార్?’ అని సెర్చ్ ఇంజిన్‌లను అడిగేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సింగ్. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (టిఐఎఫ్‌ఎఫ్)లో జితాంక్ సింగ్ గుర్జార్ తీసిన విముక్త్ (ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై) ప్రతిష్ఠాత్మమైన నెట్‌పాక్ (నెట్‌వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియా సినిమా) అవార్డ్ గెలుచుకుంది.
పక్కా పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల జితాంక్ ప్రకృతి ప్రపంచానికి చేరువయ్యే అవకాశం దొరికింది. రణగొణ ధ్వనులు లేని ఆ ప్రశాంతత బాగా ఇష్టంగా ఉండేది. తనకు ఆశ్చర్యంగా అనిపించేవాటిని, అద్భుతంగా అనిపించేవాటిని అందమైన కథలుగా చెబుతుండేవాడు. ఆ కథలు చెప్పే అలవాటే జితాంక్‌సింగ్‌ను సినిమా ప్రపంచంలోకి తీసుకువచ్చింది.
గ్రామీణ ప్రపంచం... కథల చలమ
గ్రామీణ ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పడం అంటే జితాంక్‌కు ఇష్టం.
‘ది మోస్ట్ పర్సనల్ ఈజ్ ది మోస్ట్ క్రియేటివ్’ అనే విలువైన మాట అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘విముక్త్’ కథకు స్క్రీన్‌ప్లే సమకూర్చి సినిమాగా మలిచాడు. ఇది నిర్మాత పూజా విశాల్ శర్మ రాసిన కథ. నటులు, సాంకేతిక వర్గం ఫైనల్ అయ్యాక... ‘ఇదీ కథ’ అని వారికి చె΄్పాడు. ప్రతి క్యారెక్టర్ గురించి విశ్లేషించి వివరంగా చె΄్పాడు. నటులు తమ క్యారెక్టర్‌లలో పూర్తిగా మమేకం కావడానికి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాడు.
కుంభమేళాలో షూటింగ్
జనసముద్రంలో మహా కుంభమేళాలో షూటింగ్ అంటే మాటలు కాదు. తమది చిన్న యూనిట్ కావడంతో ప్రతి సీన్ గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాడు. ఏ దృశ్యాన్ని ఎక్కడ చిత్రించాలనేదాని కోసం ఎన్నో స్థలాలను పరిశీలించాడు. సరిౖయెన లొకేషన్‌లను ఎంపిక చేసుకోవడం ఒక సవాలు అయితే, జనమూహాలలో సహజ చిత్రీకరణ అనేది మరో సవాలు. ఎలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా షూటింగ్ పూర్తిచేశాడు జితాంక్.
‘మహాకుంభమేళా సన్నివేశాలు లేక΄ోతే ఈ సినిమాయే లేదు. కాబట్టి కుంభమేళాలోని సన్నివేశాలనే మొదట చిత్రీకరించాం. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లోని బరై, పద్వా గ్రామాలలో షూటింగ్ చేశాం’ అంటాడు జితాంగ్ సింగ్. ‘గ్రామీణ ప్రాంత కథలు మాత్రమే కాదు పట్ణణాలలోని ఎన్నో సంక్లిష్ట జీవితాలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటున్నాడు జితాంక్ సింగ్ గుర్జార్.
ప్రాంతీయ భాషలో తీసిన చిత్రాన్ని ప్రపంచం మెచ్చింది
ఆ దంపతులకు వయసు పైబడుతోంది. జీవనాధారమైన తమ పొలాన్ని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఒక్కగానొక్క కొడుకు నారన్‌కు మేథో సామర్థ్యాలు లేవు. మానసికంగా అస్థిరంగా ఉంటాడు. ఒకవైపు నారన్‌ను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. మరో వైపు ఆర్థిక కష్టాలు. ఎన్నో సమస్యల మధ్య ఒక పరిష్కారాన్ని ఆశిస్తూ మహాకుంభమేళాకు వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది.
గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే తమ కష్టాలు తీరుతాయని వారు ఆశిస్తారు. గ్రామీణ భారత జీవితం, నమ్మకాలు, అపనమ్మకాలకు, అదృష్ట దురదృష్టాలకు అద్దం పట్టిన సినిమాగా ‘విముక్త్’ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బ్రజ్ భాషలో తీశారు. కేవలం పదకొండురోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. టొరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సెంటర్ పీస్ సెక్షన్‌లో ప్రదర్శించారు.
(చదవండి: Weight Loss Story: బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్‌గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..)