ఎవరి సాయం మాకొద్దు.. ‘నాటో’పై ట్రంప్ సీరియస్‌ | Trump Blasts Nato Allies | Sakshi
Sakshi News home page

ఎవరి సాయం మాకొద్దు.. ‘నాటో’పై ట్రంప్ సీరియస్‌

Mar 17 2026 10:04 PM | Updated on Mar 17 2026 10:16 PM

Trump Blasts Nato Allies

ఇరాన్‌తో యుద్ధంలో తాము పాలు పంచుకోవాలనుకోవడం లేదని నాటో (NATO) మిత్రదేశాల్లో మెజారిటీ దేశాలు తమకు సమాచారం అందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదంటూ తన ట్రూత్ సోషల్‌ మీడియాలో ట్రంప్‌ తేల్చి చెప్పారు.

"మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా మేము చేపట్టిన సైనిక చర్యలో పాలుపంచుకోవడం తమకు ఇష్టం లేదని మెజారిటీ నాటో (NATO) 'మిత్ర దేశాలు చెప్పాయి. వాస్తవానికి మేము చేస్తున్న పనిని దాదాపు ప్రతి దేశం గట్టిగా అంగీకరించింది, అలాగే ఇరాన్ ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని అవి భావిస్తున్నాయి. అయినప్పటికీ అవి వెనకడుగు వేశాయి.

..వారి చర్య నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే నాటో అనేది ఒక 'వన్ వే స్ట్రీట్' (ఏకపక్ష ప్రయోజనం) అని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. ఈ దేశాల రక్షణ కోసం మేము ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాము. మేము వారిని రక్షిస్తాము, కానీ అవసరమైన సమయంలో వారు మా కోసం ఏమీ చేయరు’’ అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

‘‘మేము ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. వారి నౌకాదళం అంతమైంది. వైమానిక దళం పోయింది, వారి యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్. రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా, దాదాపు అన్ని స్థాయిలలోని వారి నాయకులు అంతమొందించబడ్డారు. వారు ఇకపై మనల్ని కానీ, మన మధ్యప్రాచ్య మిత్రదేశాలను కానీ, ప్రపంచాన్ని కానీ ఎప్పటికీ భయపెట్టలేరు. మేము అపారమైన సైనిక విజయాన్ని సాధించినందున మాకు ఇకపై నాటో దేశాల సహాయం 'అవసరం' లేదు. అటువంటి కోరికా లేదు. నిజానికి మాకు అది ఎప్పుడూ అవసరం పడలేదు! అదేవిధంగా జపాన్, ఆస్ట్రేలియా లేదా దక్షిణ కొరియా సహాయం కూడా మాకు అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను, మాకు ఎవరి సహాయమూ అవసరం లేదు!’’ అంటూ ట్రంప్‌ ఘాటుగా రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement