
బ్యాంకాక్: నైతిక ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలపై సస్పెండయిన థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటొంగ్‌టర్న్ షినవత్రా(39)ను రాజ్యాంగ న్యాయస్థానం ఆ పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది. కోట్లకు పడగలెత్తిన షినవత్రాల కుటుంబ రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ మాత్రమే కాదు, దేశం మరోసారి రాజకీయ సంక్షోభంలో చిక్కుకునేందుకు ఈ పరిణామం దారి తీయనుందని పరిశీలకులు అంటున్నారు.
అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షినవత్రా ఏడాది కాలం మాత్రమే అధికారంలో ఉన్నారు. కాంబోడియాతో తలెత్తిన సరిహద్దు వివాదం నేపథ్యంలో జూన్‌లో ఆ దేశ మాజీ నేత హున్ సెన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కడం తీవ్ర సంచలనం రేపింది. షినవత్రా క్షమాపణ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో, ఆమె వైదొలగి ఉపప్రధానికి ఫుమ్‌తమ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం తాజాగా ఆమెను బర్తరఫ్ చేస్తూ శుక్రవారం చేస్తూ ఆదేశాలిచ్చింది.

హున్ సెన్‌ను అంకుల్ అని సంబోధించడం, థాయ్ ఆర్మీ కమాండర్లను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. కాంబోడియా నేతతో జరిపిన సంభాషణ పెటొంగ్‌టర్న్ విశ్వసనీయతపై అనుమానాలొచ్చేలా ఉందని, ఆమె హోదాకు సరైంది కాదని తీర్పులో పేర్కొంది. ఆమె తీరు థాయ్‌లాండ్ కంటే కాంబోడియాకే అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
కాగా, థాయ్‌లాండ్‌లో గత 17 ఏళ్లలో రాజ్యాంగ కోర్టు వేటేసిన ఐదో ప్రధాని షినవత్రా కావడం గమనార్హం. పెటొంగ్‌టర్న్ షినవత్రా తండ్రి సీనియర్ నేత థక్సిన్ షినవత్రా సైతం గతంలో ప్రధాని పదవిని కోల్పోయిన వారే. తాజా పరిణామంతో షినవత్రాకు చెందిన ఫ్యు థాయ్ పార్టీ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
సంప్రదాయ వాదులు, పలుకుబడి కలిగిన రాచరిక అనుకూల సైనిక నేతలతో ఎన్నికైన ప్రభుత్వాలు గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఉప ప్రధాని ఫుమ్‌తమ్, ఆయన కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే, ఇందుకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం గమనార్హం. ప్రధానమంత్రి పదవికి ఫ్యు థాయ్ పార్టీకి చెందిన 77 ఏళ్ల ఛయ్‌కసెమ్ నితిసిరితోపాటు ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు అర్హులని చెబుతున్నారు. అన్ని పార్టీలు కూడా తమ సొంత రాజకీయ అవసరాల కోసం యత్నిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటు అంత సులువుగా అయ్యే పని కాదన్నది విశ్లేషకుల మాట.
థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్టు గత 17 ఏళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులను తొలగించిందని తెలుసా?. ఆ జాబితాను పరిశీలిస్తే..
- థాక్సిన్ షినవత్ర (2006).. బలవంతపు పదవీ విరమణ. సైనిక తిరుగుబాటు తర్వాత కోర్టు ద్వారా అనర్హత వేటు. అయితే కోర్టు విచారణ ఎదుర్కొన్న సమయంలోనూ ప్రధాని పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి కూడా ఈయనే.
- సమక్ సుందరవేజ్ (2008).. ఓ ప్రముఖ ఛానెల్ కుకింగ్ షోలో పాల్గొన్నారు. దీంతో నైతిక ఉల్లంఘన పేరిట కోర్టు ఆయన్ని తొలగించింది.
- యింగ్లక్ షినవత్ర (2014).. ధాన్యం సబ్సిడీ స్కీమ్‌లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో నైతిక ఉల్లంఘనలపై కోర్టు తీర్పుతో పదవి కోల్పోయారు.
- స్రేత్థా థావిసిన్ (2024).. నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారని ఏడాది తిరగకుండానే కోర్టు ఆయన్ని తొలగించింది
పాయెతోంగ్తార్న్ షినవత్ర (2025). కంబోడియా నేత హున్ సెన్‌తో లీకైన ఫోన్ సంభాషణలో "అంకుల్" అని సంబోధించడం, థాయ్ సైనికాధికారిని "ప్రతిద్వంది"గా పేర్కొనడం వల్ల నైతిక ఉల్లంఘనగా కోర్టు అభిప్రాయంతో పదవి కోల్పోయారు.