 
													సాక్షి, చిత్తూరు: మాజీ మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఐదుగురిని దోషులుగా ఇదివరకే నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణ శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యోదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో ప్రవేశించిన దుండగులు.. మేయర్ కఠారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆపై పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. తీవ్ర గాయాలతో మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ ఘటన.
ఈ కేసులో.. తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు. దీంతో ఈ ఐదుగురికి ఇవాళ మరణశిక్ష విధించారు 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు.
కఠారి మోహన్‌కు శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ) మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. A 1 నిందితుడు చంద్ర శేఖర్ @చింటూ, A 2 నిందితుడు వెంకట చలపతి@ ములబాగల్ వెంకటేశ్, A 3 నిందితుడు జయ ప్రకాష్ రెడ్డి, A 4 నిందితుడు మంజునాథ్, A 5 నిందితుడు వెంకటేశ్@ గంగన్న పల్లి వెంకటేశ్. వీళ్లలో ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్.. అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. తీర్పు నేపథ్యంలో చిత్తూరు పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టు లపై,వాట్సప్ మెసేజ్ పై ప్రత్యేక నిఘా ఉంచారు.
హైకోర్టుకు వెళ్తాం: చింటూ తరపు లాయర్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లోనే మరణశిక్ష అత్యంత అరుదుగా ఉందంటూ నిందితుల తరఫు లాయర్ విజయ్ చంద్రారెడ్డి అంటున్నారు. చిత్తూరు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని మీడియాకు తెలిపారు. ‘‘కఠారి అనురాధ మోహన్ దంపతుల కేసులో 57 మందిని విచారించారు. ఐదుగురికి మరణశిక్ష విధించారు. నిందితులను చిత్తూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్ లో చాలా అరుదుగా మాత్రమే మరణశిక్ష విధించారు. వాళ్ల జీవితాలను బాగు చేయాలని మాత్రమే వ్యాఖ్యానించింది. 90 రోజుల్లోపు హైకోర్టును వెళ్తాం. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారాయన. 


 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
