ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు | Strong Earthquake Strikes Indonesia Banda Sea Region With 6.9 Magnitude, No Tsunami Warning - Sakshi
Sakshi News home page

Earthquake In Indonesia: ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు

Published Wed, Nov 8 2023 4:28 PM | Last Updated on Wed, Nov 8 2023 5:21 PM

Strong earthquake strikes Indonesia Banda Sea region - Sakshi

శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్‌ స్కేల్‌పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు.   

ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్‌కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.

బాందా సముద్రంలో టానింబర్‌ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు.  అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది.

ఏడాది వేల భూకంపాలు
ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే.  ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్‌గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 

2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి.  రిక్టర్‌ స్కేల్‌పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 

2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement