ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? జాగ్రత్త మరి!

Sitting For Long Time Can Affect Mental Health - Sakshi

లండన్‌ : గంటల తరబడి కూర్చోవటం వల్ల శారీరకంగానే కాదు..మానసికంగా కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాదు! వ్యాయామం ద్వారా కలిగే లాభాలను సైతం అది హరిస్తుందని ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ హర్డర్స్‌ ఫీల్డ్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  కరోనా సమయంలో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్లో.. ఇతర కారణాలవల్లో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని ఉంటున్నారని పేర్కొన్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తెలిపారు.

వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ(వ్యాయామాలు) చేసినప్పటికి ఎలాంటి లాభం ఉండదని వెల్లడించారు. దానినుంచి బయటపడాలంటే అంతకంటే ఎక్కువ సేపు వ్యాయామం చేయాల్సి ఉంటుందన్నారు. స్పోర్ట్స్‌ సైన్స్‌ ఫర్‌ హెల్త్‌ జర్నల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. శాస్త్రవేత్త లియానే ఎజివెడో మాట్లాడుతూ..‘‘ మేము 300 మందిపై పరిశోధనలు జరిపారు. వీరిలో 50 శాతంమంది ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారు. గంటల తరబడి కూర్చోవటం ఈ 50 శాతం మంది మానసిక ఆరోగ్య పరిస్థితి, సాధారణ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపింది.

ఒకవేళ మీరు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తుంటే.. దాని ప్రభావం నుంచి బయట పడటానికి ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు 60 నిమిషాల వ్యాయామం మంచిది, కనీసం 30 నిమిషాల కంటే తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్‌కు పోవటం అనే కాదు.. నడక, ఇతర పనులు చేయడం కూడా వ్యాయామమే. తోట పనులు చేసే వారు మానసికంగా, శారీరకంగా బాగున్నట్లు గుర్తించాం. కూర్చునే సమయాన్ని తగ్గించటం చాలా ఉత్తమం’’ అని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top