
అంతరిక్ష యాత్ర దిగ్విజయం
18 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో భూమికి బయల్దేరిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
22 గంటల సుదీర్ఘ ప్రయాణం మధ్యాహ్నం 3.01కు పసిఫిక్ జలాల్లో ల్యాండింగ్
వైద్యపరీక్షలు, అనంతరం వారం రోజుల క్వారంటైన్
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొస్తున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అక్కడ రెండున్నర వారాలకు పైగా గడిపిన విషయం తెలిసిందే.
స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. 22 గంటల 15 నిమిషాలకు పైగా ప్రయాణించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోరి్నయా తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది. ఆ వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలిస్తారు.
అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల నుంచి నుంచి భూ వాతావరణానికి అలవాటు పడేదాకా శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు తదితరాలు నిర్వహించిన అనంతరం వారు బయటి ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకుని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచిచూస్తోంది.
తిరిగొచ్చేది ఇలా...
నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశుతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్‌ఎస్‌కు బయల్దేరడం తెలిసిందే. దాదాపు 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. అక్కడ 18 రోజులు (443 గంటలు) గడిపారు. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు.
→ సోమవారం సాయంత్రం షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది.
→ అంతకు రెండు గంటల ముందు వారు ఐఎస్‌ఎస్ నుంచి ఒకరి తర్వాత ఒకరుగా డ్రాగన్ వ్యోమనౌకలోకి ప్రవేశించారు. నలుగురూ స్పేస్ సూట్లు ధరించాక వ్యోమనౌకను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానించే హాచ్‌ను మధ్యాహ్నం 2.37కు విజయవంతంగా మూసేశారు.
→ తర్వాత ప్రయాణానికి తుది సన్నాహాలు దాదాపు రెండు గంటల పాటు సాగాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్షణాల్లో విపరీతమైన రాపిడికి పుట్టుకొచ్చే 1,600 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకునేందుకు స్పేస్‌క్రాఫ్ట్‌కు బిగించిన హీట్ షీల్డ్‌ను సరిచూడటం వంటివి పూర్తయ్యాక డ్రాగన్ ముందు భాగాన్ని ఐఎస్‌ఎస్ నుంచి విడదీశారు.
→ అనంతరం సాయంత్రం 4.45కు వ్యోమనౌక భూమికి పయనమైంది.
→ భూమికి దాదాపు 350 కి.మీ. ఎత్తులో ఉండగా సర్వీస్ మాడ్యూల్ నుంచి డ్రాగన్ విడిపోయింది.
→ భూమి చుట్టూ పలుమార్లు చక్కర్లు కొడుతూ ప్రయాణ దిశ తదితరాలను సరిచేసుకున్న అనంతరం నిర్ధారిత ప్రాంతంలో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది.
→ క్రమంలో ముందుగా దాని ముందు భాగాన్ని మూసేస్తారు. హీట్‌షీల్డ్ కిందకు ఉండేలా క్యాప్సూల్‌ను సరిచేస్తారు.
→ విపరీతమైన వేగంతో దూసుకొచ్చే డ్రాగన్‌ను నెమ్మదింపజేసేందుకు భూమికి సుమారు 5.7 కి.మీ. ఎత్తున రెండు రెండు ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. అనంతరం 1.8 కి.మీ. ఎత్తున మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకుంటాయి.
→ క్యాప్సూల్ వాతావరణంలోకి పునఃప్రవేశించే క్రమంలో పుట్టుకొచ్చే అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ప్యారాచూట్లను అత్యంత దృఢంగా ఉండే నైలాన్, కెవ్లర్‌లతో తయారు చేస్తారు.
→ మధ్యాహ్నం 3.01 గంటలకు క్యాప్సూల్ పసిఫిక్ జలాల్లో దిగుతుంది.
→ అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే స్పెషల్ రికవరీ షిప్ వెంటనే డ్రాగన్ క్యాప్సూల్‌ను చేరుకుంటుంది.
→ దాన్ని షిప్‌లోకి చేర్చిన అనంతరం శుభాంశుతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అందులోంచి బయటికి వస్తారు.
→ అనంతరం షిప్ మీదే వారందరికీ తొలి దఫా పలురకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
→ అనంతరం వారిని హెలికాప్టర్‌లో ముందుగా తీరానికి, అనంతరం నాసా కార్యాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు.

ఐఎస్‌ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు
ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు.
ఫ్లోటింగ్ వాటర్ బబుల్
ఐఎస్‌ఎస్‌లో 60కి పైగా ప్రయోగాలు
శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు.
దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.
76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు
శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది.
నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం
భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్‌ఎస్‌లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కని్పంచిన తీరును వరి్ణంచిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కని్పస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్.
అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.
కలుద్దాం! అతి త్వరలో భూమిపై కలుద్దాం
– ఐఎస్‌ఎస్ నుంచిబయల్దేరే ముందు శుభాంశు
శుభాంశూ... సుస్వాగతం
‘‘యాగ్జియం–4 స్పేస్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొస్తున్న శుభాంశుకు హార్దిక స్వాగతం. ఆయన రాక కోసం దేశమంతా ఎనలేని ఆనందోత్సాహాలతో, అత్యంత ఉత్సుకతతో ఎదురుచూస్తోంది.
– కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్