ఇది అద్భుత క్షణం.. భార్య, కుమారుడిని హత్తుకుని శుభాంశు ఎమోషనల్‌ | Shubhanshu Shukla emotional reunion with family members | Sakshi
Sakshi News home page

ఇది అద్భుత క్షణం.. భార్య, కుమారుడిని హత్తుకుని శుభాంశు ఎమోషనల్‌

Jul 17 2025 10:38 AM | Updated on Jul 17 2025 11:23 AM

Shubhanshu Shukla emotional reunion with family members

ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఎమోషనల్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో శుభాంశు శుక్లా.. తన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌గా భార్య, కుమారుడిని హత్తుకున్నారు. రెండు నెలల తర్వాత వారిని కలవడంతో శుభాంశ్‌ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించి ఫొటోలను శుభాంశు.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని.. పోస్టులో చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో పోస్టులో శుభాంశు.. ‘అంతరిక్షయానం అద్భుతం. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతం. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్‌లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశాను. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయి. అయితే మనుషుల వల్లే అవి అలా మారాయి’ అని ఎమోషనల్‌ అయ్యారు.

మరోవైపు, శుభాంశు సతీమణి కమ్నా స్పందిస్తూ.. ‘శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్‌. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే దృష్టి నిలుపుతాం. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్‌ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్‌ చేసుకుంటున్నా అని’ ఆనందంతో పోస్టు పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement