
క్యాప్సూల్ నుంచి బయటికొస్తూ శుభాంశు అభివాదం
18 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి క్షేమంగా భూమిపైకి చేరుకున్న భారత వ్యోమగామి
భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ ‘గ్రేస్’ వ్యోమనౌక
పరీక్షల నిమిత్తం శుభాంశు బృందం క్వారంటైన్‌కు తరలింపు
మానవసహిత అంతరిక్ష యాత్రలకు భారీ ఊపు
శుభాంశుకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ.. భారత్ పేరును విశ్వవ్యాప్తంగా రెపరెపలాడించారన్న రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఆయనతో పాటు యాగ్జియం–4 మిషన్ బృందంలోని మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని స్పేస్ ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి విడివడి నింగి నుంచి నేలకేసి సుదీర్ఘయానం ప్రారంభించడం తెలిసిందే.
22.5 గంటల ప్రయాణం అనంతరం షెడ్యూల్ ప్రకారం అది మంగళవారం తెల్లవారుజామున 2.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:02కు) అమెరికాలో దక్షిణ కాలిఫోరి్నయాలోని శాన్‌డీగో తీర సమీపంలో పసిఫిక్ సముద్ర జలాల్లో విజయవంతంగా దిగింది. తర్వాత కాసేపటికే ముందుగా అమెరికాకు చెందిన మిషన్ కెప్టెన్ పెగ్గీ వాట్సన్ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చారు. మిషన్ పైలట్‌గా వ్యవహరించిన 39 ఏళ్ల శుభాంశు, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే నిండైన చిరునవ్వుల నడుమ బయటికి వచ్చి దేశవాసులను ఉద్దేశించి చేతులూపుతూ అభివాదం చేశారు. అప్పటిదాకా దేశవ్యాప్తంగా టీవీ తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠభరితంగా వీక్షించిన ప్రజలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
భారత్‌మాతా కీ జై అంటూ ఆనందోత్సాహాలతో నినదించారు. శుభాంశు స్వస్థలమైన యూపీ రాజధాని లఖ్‌నవూలోనైతే సంబరాలు అంబరాన్నంటాయి. ఎవరిని చూసినా మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కన్పించారు. తనయుడు క్షేమంగా భూమికి తిరిగొచ్చిన క్షణాలను వీక్షించే క్రమంలో ఆయన తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాల్చారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుభాంశు భార్య కామ్నాది కూడా అదే పరిస్థితి! రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు మొదలుకుని రాజకీయ తదితర రంగాల ప్రముఖలంతా శుభాంశును అభినందించారు.
‘‘చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి తిరిగొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశవాసులందరితో కలిసి అత్యంత సాదరంగా స్వాగతిస్తున్నా’’అంటూ మోదీ హర్షం వెలిబుచ్చారు. వైద్యపరీక్షలు తదితరాల అనంతరం శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు క్వారెంటైన్‌కు తరలించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)కు శుభాంశు ఐఎస్‌ఎస్ యానం భారీ ఊపునిచ్చింది. నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా శుభాంశు, వాట్సన్‌తో పాటు స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న బయల్దేరి 26న ఐఎస్‌ఎస్ చేరడం తెలిసిందే. అక్కడ 18 రోజుల పాటు వారు వివిధ రకాలైన 60 ప్రయోగాలు నిర్వహించి తిరిగొచ్చారు.

లఖ్‌నవూలో శుభాంశు తల్లిదండ్రులు, బంధుమిత్రుల ఆనందోత్సాహాలు
విశేషాలు...
⇒ శుభాంశు అంతరిక్ష, ఐఎస్‌ఎస్ యాత్రపై ఇస్రో రూ.550 కోట్లు వెచ్చించింది. ఈ యాత్రలో ఆయన సాధించిన అనుభవం 2027 కల్లా సాకారం చేసుకోవాలని తలపెట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఎంతగానో ఉపకరించనుంది.
⇒ విస్నియెవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా తమ దేశాల నుంచి ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి వ్యోమగాములుగా నిలిచారు.
⇒ తనయుడు క్షేమంగా తిరిగి రావా లని ప్రార్థిస్తూ డ్రాగన్ క్యాప్సూల్ భూమిని చేరేదాకా ఆయన తల్లి ఆశాదేవి సుందరకాండ పారాయణం చేస్తూ గడిపారు.

డ్రాగన్ వేగాన్ని తగ్గిస్తున్న ప్యారాచూట్లు
ఇలా తిరిగొచ్చారు...
⇒ శుభాంశు బృందాన్ని తీసుకుని భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి బయల్దేరిన డ్రాగన్ వ్యోమనౌక 22.5 గంటల పాటు ప్రయాణించి మంగళవారం భూమిని చేరింది.
మధ్యాహ్నం 2:07 గంటలు: క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించే ముందు కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ మొదలై 18 నిమిషాల పాటు కొనసాగింది.
2:27: సోలార్ ప్యానెళ్లు, రేడియేటర్లతో కూడిన ముందు భాగాన్ని క్యాప్సూల్ విజయవంతంగా వదిలించుకుంది.
2:33: తిరిగి క్యాప్సూల్ ముందు భాగాన్ని మూసివేసే ప్రక్రియ విజయవంతంగా జరిగింది.
2:43: గంటకు ఏకంగా 28 వేల కి.మీ. వేగంతో భూ వాతావరణంలో ప్రవేశించింది. ఆ రాపిడి ఫలితంగా ఏకంగా 1,600 నుంచి 1,900 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పుట్టుకొచ్చింది. అంతటి వేడినీ డ్రాగన్ క్యాప్సూల్ తాలూకు హీట్ షీల్డ్ విజయవంతంగా తట్టుకుంది.
2:44: విపరీతమైన వేగం కారణంగా స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో క్యాప్సూల్‌కు 11 నిమిషాల పాటు సంబంధాలు తెగిపోయాయి. అదే సమయంలో దాని వేగాన్ని తగ్గించే ప్రక్రియ మొదలైంది.
2:54: మళ్లీ సిగ్నల్స్ కలిశాయి.
2:59: భూమికి 5 కి.మీ. ఎత్తులో రెండు ప్యారాచూట్లు తెరుచుకుని వేగాన్ని చాలావరకు తగ్గించాయి.
3:00: 2 కి.మీ. ఎత్తులో ఉండగా మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకోవడంతో క్యాప్సూల్ వేగం గంటకు 118 మైళ్లకు దిగివచ్చింది.
‘‘యాగ్జియం–4 మిషన్‌కు సారథ్యం వహించి సురక్షితంగా తిరిగొచ్చిన శుభాంశుకు, ఈ చరిత్రాత్మక మిషన్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు’’ – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
‘‘ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు సాధించిన ఘనత కోట్లాది మంది భారత యువత తమ కలలను నిజం చేసుకునేందుకు తిరుగులేని స్ఫూర్తిగా నిలిచింది. గగన్‌యాన్ ప్రాజెక్టు దిశగా ఈ యాత్ర ఓ తిరుగులేని మైలురాయి’’ – ప్రధాని మోదీ
శుభాంశు యాత్ర హైలైట్స్
⇒ రాకేశ్ శర్మ అనంతరం 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలో వెళ్లిన తొలి భారతీయునిగా శుభాంశు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడు కూడా ఆయనే. ఆయన అంతరిక్ష యాత్ర సాగిన తీరు...
⇒ 2024లో యాగ్జియం–4 వాణిజ్య మిషన్‌ను ఇస్రో, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.
⇒ 2025 మొదట్లోనే ప్రయోగం జరగాల్సింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.
⇒ జూన్ 25న స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ ద్వారా యాగ్జియం–4 మిషన్ అంతరిక్షానికి బయల్దేరింది.
⇒ 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 26న విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ను చేరింది.
⇒ అక్కడ శుభాంశు బృందం 18 రోజుల పాటు గడిపింది. ఆయన పలు కీలక ప్రయోగాలు చేయడంతో పాటు ప్రధాని మోదీ, విద్యార్థులు, తన తల్లిదండ్రులతో సంభాషించారు.
⇒ జూలై 13న శుభాంశు బృందం తిరుగు ప్రయాణ సన్నాహాలు మొదలయ్యా యి. ఐఎస్‌ఎస్‌లోని సహచరులు వారికి సాదరంగా వీడ్కోలు పలికారు.
⇒ జూలై 14 సాయంత్రం డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు బృందం తిరుగు పయనమైంది.
⇒ జూలై 15 మధ్యాహ్నం 3:01 గంటలకు కాలిఫోర్నియా తీర సమీపంలో సురక్షితంగా దిగింది.