
న్యూఢిల్లీ: యెమెన్‌లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష కేసు అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
నిమిష తరఫున లాయర్‌ను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. సదరు లాయర్ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ అందుబాటులో అవసరమైన సలహాలు ఇస్తున్నారన్నారు. అలాగే యెమెన్ అధికారులతో కూడా లాయర్ టచ్‌లో ఉంటూ కేసుకు సంబంధించిన విషయాల్ని చూసుకంటున్నారని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
కాగా, యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం(జూలై 16వ తేదీ) మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడింది.
2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్‌లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి.