తాలిబన్లు అంతే!.. వాళ్ల బిడ్డలేమో విదేశాల్లో.. ఇక్కడి బిడ్డలపై ఆంక్షలు!

School Ban Afghan Girls Taliban Leader Daughters Study Abroads - Sakshi

తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్‌ పౌరులే. తాలిబన్‌ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!.

ఇస్లామిక్‌ ఎమిరేట్‌ అలియాస్‌ తాలిబన్‌ సర్కార్‌.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్‌ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్‌ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అఫ్గనిస్థాన్‌లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్‌ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్‌ కేబినెట్‌లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్‌, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్‌ ఎబాద్‌, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌, తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహెయిల్‌ షాహీన్‌లు ఉన్నారు. 

సుహెయిల్‌ షాహీన్‌ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్‌బాల్‌ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్‌ కూతురు ఇస్లామాబాద్‌లో మెడిసిన్‌ చదువుతోంది. ఆమె టెన్నిస్‌ ఛాంపియన్‌. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్‌ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు.

మళ్లీ పెళ్లిళ్లు!
ఇదిలా ఉంటే తాలిబన్‌ నేతలు ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్‌ సర్వెంట్‌లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుత్నున్నారు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top