
భారత్‌పై ప్రభావం ఎంత?
దుబాయ్/ఇస్లామాబాద్: పాకిస్తాన్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందం వల్ల భారత్‌పై ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ భారత్‌పై తమపై దాడికి దిగితే ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా సైన్యం తమకు మద్దతుగా నిలస్తుందని పాకిస్తాన్ విశ్వసిస్తోంది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే పాక్ ఆశలు నెరవేరే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్, సౌదీ అరేబియాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయి.
ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. ఏ దేశమైనా తమపై దాడికి దిగితే ఉమ్మడిగా ఎదుర్కొంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, ఫలానా దేశం అంటూ పేర్లు ప్రస్తావించలేదు. ఇండియాకు నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియా. 2024–25లో ఇరుదేశాల మధ్య 41.88 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
పాక్–సౌదీ అరేబియాల మధ్య వాణిజ్యం దాదాపు 4 బిలియన్ డాలర్లే. పాకిస్తాన్ కోసం భారత్‌పై సౌదీ అరేబియా యుద్ధం చేసే అవకాశం లేదన్నది నిపుణుల అంచనా. పాక్, సౌదీ అరేబియా తాజా ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కోణంలో చూడాలని చెబుతున్నారు. ఇజ్రాయెల్ గనుక పాక్‌పై దాడికి పాల్పడితే ఒప్పందం ప్రకారం పాక్‌కు మద్దతుగా సౌదీ అరేబియా సైన్యం రంగంలోకి దిగుతుందని పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో అరబ్ దేశాలు–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య ఇప్పటిదాకా నాలుగు యుద్ధాలు జరిగాయి. మూడుసార్లు భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాక్‌కు అండగా సౌదీ అరేబియా ఏనాడూ జోక్యం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే.
ఇదీ ఒప్పందం
అణ్వాయుధ దేశం పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’పై రెండు దేశాలు బుధవారం సంతకాలు చేశాయి. దీనివల్ల ఇరుదేశాల మధ్య రక్షణ బంధం మరింత బలపడనుంది. ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం అండగా నిలుస్తుంది. పాక్, సౌదీ అరేబియాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై జరిగినట్లేనని పరిగణిస్తాయి. రక్షణ రంగంలో పాక్, సౌదీ అరేబియా దశాబ్దాలుగా సహకరించుకుంటున్నాయి.
ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, ఎవరైనా దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉమ్మడి పోరాటం సాగించడం ఒప్పందం అసలు ఉద్దేశమని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
భద్రత విషయంలో అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని గల్ఫ్ అరబ్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ గతవారం ఖతార్‌లోని దోహా నగరంలో వైమానిక దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చల్లో పాల్గొన్న హమాస్ నేతలను అంతం చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఉన్నట్లు అరబ్ దేశాలు భావిస్తున్నాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతోపాటు తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా నుంచి సెక్యూరిటీ గ్యారంటీ ఇకపై ఆశించినంతగా ఉండకపోవచ్చని అంచనాకొచ్చాయి. అందుకే పొరుగు దేశాలతో రక్షణ ఒప్పందాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం.
భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం: సౌదీ అధికారి
ఎన్నో ఏళ్ల చర్చల తర్వాతే పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదిరినట్లు సౌదీ అరేబియా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏవో కొన్ని దేశాలు లేదా కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని జరిగిన ఒప్పందం కాదని స్పష్టంచేశారు. తమ రెండు దేశాల మధ్యనున్న దీర్ఘకాల, లోతైన సహకారాన్ని వ్యవస్థీకృతంగా మార్చుకోవాలన్నదే అసలు లక్ష్యమని వివరించారు.
భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–సౌదీ అరేబియాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా బలమైన సంబంధాలు ఇప్పుడున్నాయని వెల్లడించారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి పని చేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్‌లతో సంబంధాల విషయంలో సమతూకం పాటించాలన్నదే తమ విధానమని తెలిపారు. పాక్ ప్రభుత్వం అణు శక్తిని సౌదీ అరేబియాకు అందజేయడానికి అంగీకరించిందా? అని ప్రశ్నించగా.. ఇది సమగ్ర రక్షణ ఒప్పందమని, సైనికపరంగా అన్ని అంశాలూ దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేశారు.
అధ్యయనం చేస్తాం: రణదీర్ జైస్వాల్
పాక్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ స్పందించారు. ఈ పరిణామంపై తమకు అవగాహన ఉందని వెల్లడించారు. భారతదేశ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఈ ఒప్పందం చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్’లో పోస్టు చేశారు.